దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు, ఫరీదాబాద్ పేలుడు పదార్థాల అక్రమ నిల్వలో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్న దర్యాపు అధికారులు సంచలన విషయం ఒకటి తెలిసింది. పుల్వామా దాడి సూత్రధారి, జైషే కమాండర్ ఉమర్ ఫరూక్ భార్య అఫిరా బీబీతో, ఫలాహ్ యూనివర్సిటీ డాక్టర్ షహీన్ సయీద్‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
ఫిబ్రవరి 2019లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను పేలుడు పదార్థాలు ఉన్న కారుతో ఫరూక్ ఢీ కొట్టి ఆత్మాహుతికి పాల్పడిన ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడి తర్వాత జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజార్ మేనల్లుడైన ఉమర్ ఫరూఖ్ ఇండియా ఆర్మీ ఎన్ కౌంటర్లో హత్యమయ్యాడు. అతడి భార్యే అఫిరా బీబీ.
ఈ ముష్కర మూక ఇటీవల తన వ్యూహాలను మార్చుకుంటోంది. కొత్తగా మహిళా విభాగం ఏర్పాటుచేసి వారిని జీహాదీలుగా మార్చడానికి సిద్ధమైనట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. జైషే ప్రారంభించిన ‘జమాతే అల్ మోమినాత్’లో కొన్ని వారాల ముందు అఫిరా ఈ గ్రూప్ సలహా మండలి షౌరాలో చేరారని భద్రతా దళాల దర్యాప్తులో వెల్లడయ్యింది.
షహీన్ పాస్‌పోర్ట్ వివరాల ప్రకారం 2016 నుంచి 2018 మధ్య యూఏఈలో నివసించినట్లు బయటపడింది. అయితే, డాక్టర్ షాహీన్ విచిత్రంగా ప్రవర్తించేదని, చెప్పాపెట్టకుండా సెలవు పెట్టి ఎవరికీ సమాచారం ఇచ్చేది కాదని ఆమెతో పనిచేసిన సహచరులు చెబుతున్నారు. డాక్టర్ హయత్ జాఫర్‌తో ఆమె వివాహం కాగా 2012లో విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా ప్రస్తుతం తండ్రి వద్దే ఉంటున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత తనతో ఎప్పుడూ మాట్లాడలేదని డాక్టర్ జాఫర్ తెలిపారు. ఇక, షహీన్ సోదరుడు కూడా ఈ కుట్రలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

More Stories
భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఐపీఎస్ జీవీ సందీప్ చక్రవర్తి
పార్టీ ఫిరాయించిన ఎమ్యెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు
ఉగ్రకుట్రకు అడ్డాగా అల్ ఫలాహ్‌లో 17వ నంబర్ భవనం