రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని, అయితే ప్రసుతం ఏపీలో వ్యాపారానికి ప్రశాంతమైన వాతావరణం నెలకొందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలిపారు. సరైన సమయంలో సరైన ఆలోచనే విజయానికి పునాది అని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తోనే పెట్టుబడులు వస్తాయని చెప్పారు. శుక్రవారం విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సును భారత ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.
మూడు దశాబ్దాలుగా చంద్రబాబు తనకు స్నేహితుడు అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దేశంలో పేదరికం తగ్గించేందుకు కేంద్రం అనేక చర్యలు చేపడుతొందని, వ్యాపార అనుకూల రాష్ట్రంగా ఏపీ నిలిచిందని కొనియాడారు. ఏపీలో వ్యాపారానికి ప్రశాంతమైన వాతావరణం ఉందని, చంద్రబాబు సారథ్యంలో ఏపీకి అనేక పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.
పెట్టుబడిదారులను ఆకర్షించే విషయంలో చంద్రబాబు ముందుంటారని పేర్కొంటూ ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి ఏపీలో పెట్టుబడి పెడుతున్నారని ఉదహరించారు. లక్ష్యం పెట్టుకోవడం సులువు అని, అక్కడికి చేరుకోవడమే కష్టం అని ఉపరాష్ట్రపతి వివరించారు. కార్మిక చట్టాలు, పన్నుల్లో కేంద్రం అనేక సంస్కరణలు తెచ్చిందని తెలిపారు.
మోదీ హయాంలో వికసిత్ భారత్ దిశగా దూసుకెళ్తున్నామని చెబుతూ చంద్రబాబు స్వప్నం సాకారం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని, ఏపీ ఎగుమతులు, దిగుమతులకు విశాఖ గేట్‌వేగా మారిందని ఆయన ప్రశంసించారు. స్వర్ణాంధ్ర కావాలన్న చంద్రబాబు స్వప్నం సాకారం కావాలని ఆకాంక్షించారు.
పెట్టుబడులకు స్వర్గధామంగా విశాఖ మారిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. ప్రపంచ భాగస్వామ్యానికి నిదర్శనంగా ఈ సదస్సు నిలుస్తోందని చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్‌కు చిరునామాగా ఏపీ మారిందని గవర్నర్ పేర్కొన్నారు.
మరో రెండేళ్లలో డ్రోన్ ట్యాక్సీలు కూడా వస్తాయని, అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వ్యాపారం చేసేవారిని అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నామని చెబుతూ తమ ప్రభుత్వం వచ్చాక 27 పాలసీలు తెచ్చామని గుర్తు చేశారు. పెట్టుబడిదారులకు ఎస్క్రో అకౌంట్ ఇస్తామని, మరో మూడేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది తమ లక్ష్యం అని సీఎం చంద్రబాబు వివరించారు.
ఏపీకి పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రావాలనేదే లక్ష్యం అని, గ్రీన్ ఎనర్జీ వినియోగం, స్వచ్ఛాంధ్ర దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఏపీకి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయని చెప్పారు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీలో మన రాష్ట్రమే ముందుందని, రాష్ట్రాభివృద్ధిలో పర్యాటకరంగానిది కీలకపాత్ర కానుందని సీఎం తెలిపారు.
దేశానికి గేట్‌వేలా ఆంధ్రప్రదేశ్ ఉందని, పెట్టుబడిదారుల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మారుతోందని స్పష్టం చేశారు. మోదీ పాలనా సంస్కరణలను దేశ ప్రజలు నమ్మారని, ఆయన పరిపాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. 2047లోగా మనదేశం నెంబర్‌వన్ ఎకానమీ అవుతుందని పేర్కొంటూ ప్రజలను, వనరులను, సాంకేతికతను సమర్థంగా వాడుకుంటే తిరుగులేదని స్పష్టం చేశారు.
More Stories
ట్రంప్‌కు క్షమాపణలు చెప్పిన బీబీసీ
బీహార్ లో ఏకపక్షంగా 200 సీట్ల వైపు ఎన్డీయే ప్రభంజనం
పరకామణి కేసులో ఫిర్యాదు చేసిన అధికారి మృతి