మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో `మానస’  బాలల దినోత్సవం

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో `మానస’  బాలల దినోత్సవం

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మైక్రోసాఫ్ట్, హైదరాబాద్‌కు చెందిన 20 మందికి పైగా ఉద్యోగులు శుక్రవారం మానస చిన్నారుల ఆరోగ్య వైకల్యాలు అధ్యయన సంస్థను సందర్శించి, మానస  ప్రత్యేక పాఠశాలలోని ప్రత్యేక పిల్లలతో కలిసి బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మునీందర్ రాజా మాట్లాడుతూ మానస ప్రత్యేక పిల్లలతో బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం తమకు ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్శన మైక్రోసాఫ్ట్ ఎంప్లాయి గివింగ్ ప్రోగ్రామ్‌లో భాగమని తెలిపారు. సౌరభ్ మాట్లాడుతూ, మానస సందర్శన ద్వారా ప్రత్యేక పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను, వారి ప్రతిభను దగ్గరగా అర్థం చేసుకోవడానికి అవకాశం లభించిందని తెలిపారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లల కోసం వివిధ ఆటలు, వినోద కార్యక్రమాలు నిర్వహించగా, విజేతలకు మైక్రోసాఫ్ట్ బృందం బహుమతులు అందజేసింది. ప్రత్యేక పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సక్షం  సంస్థ నిర్వహించింది.
 
దేశవ్యాప్తంగా దివ్యాంగుల సమగ్ర శక్తివంతీకరణ కావించి, వారిని సాధారణ జీవన ప్రవాహంలోకి తీసుకురావడానికి సాక్షం కృషి చేస్తున్నట్లు తెలంగాణ అధ్యక్షులు ఆరని దయాకర్ రావు తెలిపారు. సక్షం సంస్థ నిర్వహిస్తున్న ధీమహి కేంద్రాలు, అంధులకు, దృశ్య‌దోషం ఉన్నవారికి అందిస్తున్న నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాల కల్పన వంటి కార్యక్రమాలను రాష్ట్ర కార్యదర్శి చిదం విక్రమ్ వివరించారు. మానస  ప్రత్యేక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  శ్రీమతి విజయభాను, క్లినికల్ కోఆర్డినేటర్ శ్రీమతి అనిత, మానసలో అందిస్తున్న ప్రత్యేక విద్యా సేవలు, న్యూరో–డెవలప్మెంట్ థెరపీలు గురించి వివరించారు.