విద్యార్థుల చదువు, వారికి కనీస సదుపాయాలు కల్పించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి విద్యార్థుల పట్ల తన ఉదారతను చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై ఫైనల్ పరీక్ష ఫీజు భారం పడకుండా తానే ఆ ఫీజును చెల్లించేందుకు ముందుకొచ్చారు.
ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి దాసరి హరిచందనకు కేంద్ర మంత్రి లేఖ రాశారు. ‘ ఏ ఒక్క విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదనేది నా అభిమతం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు ఇచ్చిన అంత్యోదయ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి పిల్లలకు నా వంతుగా సహాయం చేయాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులందరికీ తెలంగాణ ఎస్ ఎస్ సి బోర్డు పరీక్ష ఫీజు మొత్తాన్ని తన జీతం నుంచి చెల్లించాలని నిర్ణయించిన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు కేంద్ర మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని మస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల్లో మౌలికవసతుల కల్పన, విద్యార్థులకు అవసరమైన వస్తువుల పంపిణీ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, మెకనైజ్డ్ టాయిలెట్ క్లీనింగ్ మెషీన్స్ అందజేస్తున్నారు. దీంతోపాటుగా డబుల్ డెస్క్ బెంచీలను కూడా కిషన్ రెడ్డి సమయానుగుణంగా అందజేస్తున్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభంలో నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్నారు. పలు పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్ కు కూడా కేంద్రమంత్రి సహకారం అందించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు అందిస్తున్న సహకారంలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థుల ఫైనల్ ఎగ్జామ్ ఫీజును పార్లమెంటు సభ్యుడిగా అందుకుంటున్న వేతనం నుంచి చెల్లించాలని నిర్ణయించారు.

More Stories
మంత్రి కొండా సురేఖపై నాగార్జున కేసు ఉపసంహరణ
తెలంగాణలో అంతర్జాతీయ చేపల ఎగుమతి కేంద్రం
శంషాబాద్ లో రూ. 3 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు