భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఐపీఎస్ జీవీ సందీప్ చక్రవర్తి

భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఐపీఎస్ జీవీ సందీప్ చక్రవర్తి

తాజాగా ఢిల్లీ పేలుడు ఘటనతో దేశంలో ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం అయింది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన పోస్టర్లను గుర్తించిన ఓ ఐపీఎస్ అధికారి దేశవ్యాప్తంగా అప్రమత్తం చేయడంతో తీగ లాగితే డొంకంతా కదిలిన్నట్లు మొత్తం ఉగ్రతీగా బైటకు వచ్చింది. హర్యానాలో పేలుడు పదార్థాలు బయటపడటంతోపాటు ఢిల్లీలో భారీ పేలుళ్లకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

ఈ మొత్తం ఉగ్ర వ్యూహాలను భగ్నం చేయడంలో తెలుగు వ్యక్తి ఉండటం గమనార్హం. అతడే ఐపీఎస్ అధికారి డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి . జమ్మూ కాశ్మీర్‌లో ఎస్ఎస్‌పీగా పనిచేస్తున్న డా. సందీప్ చక్రవర్తి నెల రోజుల క్రితమే జైషే మహమ్మద్ ఉగ్ర పోస్టర్ ను గుర్తించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా భారత్‌లో పెను విధ్వంసం జరగకుండా అడ్డుకున్నారు.
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్ఎస్‌పీగా) డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి సేవలు అందిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం శ్రీనగర్‌లోని నౌగామ్ బన్పియోరా వీధుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అతికించిన అనుమానాస్పద పోస్టర్లను గుర్తించి, వాటి వెనుక పెద్ద ప్రమాదం పొంచి ఉందని భావించి, దర్యాప్తుకు ఆదేశించారు.  సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు వ్యక్తులను గుర్తించి విచారణ చేయగా స్థానిక ఇమామ్ అయిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ పేరు బయటికి వచ్చింది.
దీంతో శ్రీనగర్ పోలీసులు ఇర్ఫాన్ అహ్మద్ ఇంటిని తనిఖీ చేయగా అతని ఇంట్లో దొరికిన డిజిటల్ పరికరాల ద్వారా భారీ ఉగ్ర నెట్‌వర్క్‌తో సంబంధాలు బయటికి వచ్చాయి.

ఈ సమాచారం ఆధారంగా ఓ స్పెషల్ టీమ్ హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనైని అరెస్ట్ చేయగా మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత జైషే మహమ్మద్ ఉగ్రవాదానికీ సంబంధించిన చాలా మంది కాశ్మీరీ డాక్టర్లు, ఇతరులను అరెస్ట్ చేయగాఈ దర్యాప్తులో భారీగా పేలుడు పదార్థాలు, ఏకే-47 రైఫిల్స్ కూడా లభించాయి.

డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి తన కెరీర్‌‌లో ఎన్నో విజయాలు సాధించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఒక ఉగ్రవాద నెట్‌వర్క్‌ను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఒక మెడికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆయన స్వస్థలం. తండ్రి డాక్టర్ జీవీ రామ గోపాల్ రావు గవర్నమెంట్ డాక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన తల్లి పీసీ రంగమ్మ  ఏపీ రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు.

కర్నూలు మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్‌లో విద్యనభ్యసించిన జీవీ సందీప్ చక్రవర్తి మెడిసిన్‌ చేశారు. ఆ తర్వాత సివిల్స్‌లో ర్యాంకు సాధించి 2014లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం శ్రీనగర్‌ ఎస్ఎస్‌పీగా పనిచేస్తున్న ఆయన పూంచ్‌ ఏఎస్‌పీగా తన సర్వీసును ప్రారంభించారు. ఆ తర్వాత.. హంద్వారా, కుప్వారా, కుల్గాం, అనంతనాగ్‌, శ్రీనగర్‌ సౌత్‌ జోన్‌, బారాముల్లా వంటి కీలక ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించారు.

జీవీ సందీప్‌ చక్రవర్తి ఇప్పటివరకు 6 రాష్ట్రపతి శౌర్య పతకాలు, 4 జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ గ్యాలంట్రీ మెడల్స్, ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ కమెండేషన్‌ డిస్క్ సహా అనేక పురస్కారాలను దక్కించుకున్నారు. గతంలో డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి  ‘ఆపరేషన్ మహాదేవ్’లో భాగంగా పహల్గామ్ ఉగ్రదాడి చేసిన ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టిన జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు బృందానికి నాయకత్వం వహించారు. ఈ ఏడాది ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్‌ మెడల్‌ అందుకున్నారు.