ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం బఘేల్‌ కుమారుడి ఆస్తుల జప్తు

ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం బఘేల్‌ కుమారుడి ఆస్తుల జప్తు
ఛత్తీస్‌గఢ్‌ మద్యం కుంభకోణం కేసులో ఈడీ కీలక చర్యలు తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి తనయుడు భూపేష్‌ బఘేల్‌ కొడుకు చైతన్య బాఘేల్‌కు చెందిన రూ.61.20కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలిక ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) 2002 కింద చర్యలు తీసుకుంది. ఈడీ వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో రూ.59.96కోట్ల విలువైన 364 ప్లాట్లు, వ్యవసాయభూమి సహా స్థిరాస్తులు ఉన్నాయి. 
 
అలాగే, బ్యాంక్‌ బ్యాలెన్స్‌, స్థిర డిపాజిట్‌లతో సహా రూ.1.24కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణంపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. రూ.2500కోట్ల విలువై మద్యం సిండికేట్‌లో చైతన్యది కీలకపాత్రని ఈడీ పేర్కొంది.  ఈ నిధుల సేకరణ, పంపిణీకి సంబంధించిన అన్ని ప్రధాన నిర్ణయాలన్నీ ఆయన ఆదేశాల మేరకు తీసుకున్నట్లుగా ఆరోపించింది. 
 
చైతన్య బాఘేల్ నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అందుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. అక్రమంగా సంపాదించిన ఆదాయాన్ని తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ద్వారా వైట్‌గా మార్చాడని పేర్కొంది. చైతన్య బాఘేల్‌ మద్యం కుంభకోణం నుంచి పొందిన నేర ఆదాయం (పిఓసి) తన యాజమాన్య సంస్థ మెస్సర్స్‌ బాఘేల్‌ డెలవలపర్స్‌ ఆధ్వర్యంలో తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ విఠల్ గ్రీన్‌ను అభివృద్ధి చేయడానికి ఉపయోగించారని చెప్పింది. 
 
చైతన్య బాఘేల్‌ను మద్యం కుంభకోణం కేసులో ఈ ఏడాది జులై 18న అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో అనిల్‌ తుతేజా (మాజీ ఐఏఎస్‌), అరవింద్‌ సింగ్‌, త్రిలోక్ సింగ్‌ ధిల్లాన్‌, అన్వర్‌ ధేబర్‌, అరుణ్‌ పాటి త్రిపాఠి (ఐటీఎస్‌), కవాసి లఖ్మా (మాజీ ఎక్సైజ్ మంత్రి) ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం జప్తు చేసిన రూ.61.20కోట్లు సుమారు.. రూ,215కోట్ల స్థిరాస్తుల స్వాధీనంలో భాగమేనని ఈడీ తెలిపింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది.