నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్జరీ.. రూ.99 లక్షలు స్వాహా

నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్జరీ.. రూ.99 లక్షలు స్వాహా
దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఒకప్పుడు బ్యాంక్ కేవైసీ అప్డేట్, ఓటీపీ, ఆన్‌లైన్ డెలివరీ వంటి వాటి పేరుతో మోసం చేసే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి డిజిటల్ అరెస్ట్ పేరుతో జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్, విచారణ పేరు చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు. 
 
తాజాగా కొందరు కేటుగాళ్లు ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు చెప్పి రూ.99 లక్షలు కాజేశారు.  నిర్మలా సీతారామన్ ఫోర్జరీ సంతకం, నకిలీ సీల్ ఉన్న ఫేక్ అరెస్ట్ వారెంట్ చూపించి ఒక 60 ఏళ్ల మహిళ వద్ద నుంచి రూ.99 లక్షలు కాజేశారు కేటుగాళ్లు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఈ సంఘటన అక్టోబర్ చివరి వారంలో పుణెలోని కొథ్రుడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలు ఎల్‌ఐసీ సంస్థలో ఉన్నతోద్యోగినిగా విధులు నిర్వర్తించి కొన్నాళ్ల క్రితమే రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్న ఆమెకు అక్టోబర్ చివరి వారంలో సైబర్ కేటుగాళ్లు కాల్ చేశారు.
 
 తమను తాను ‘డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ’ నుంచి కాల్ చేస్తున్నామని, తాను సీనియర్ అధికారినంటూ నిందితుడు పరిచయం చేసుకున్నాడు. బాధితురాలి ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను, అక్రమ లావాదేవీలకు ఉపయోగించినట్లు నిందితుడు ఆమెని బెదిరించాడు. ఆ తర్వాత ఆమెకు జార్జ్ మాథ్యూ అనే మరో వ్యక్తి కాల్ చేసి మనీలాండరింగ్ కేసులో బాధితురాలి పేరు ఉందని చెప్పాడు.
 
అంతటితో ఊరుకోక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫోర్జరీ సంతకం, నకిలీ అధికారిక ముద్ర, సీల్‌తో కూడిన అరెస్ట్ వారెంట్‌ని బాధితురాలికి పంపించారు. అయితే ఆమె వయసు రీత్యా ప్రస్తుతం అరెస్ట్ చేయడం లేదని, కానీ విచారణ కోసం కెమెరా ముందుకు రావాలని సూచించారు. అలానే ధ్రువీకరణ కోసం కొంత డబ్బు పంపాలని అడగంతో బాధితురాలు ఆమొత్తం పంపింది. 
 
ఆ తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి రూ.99 లక్షలు అడిగాడు. అప్పటికే భయంతో వణికిపోతున్న బాధితురాలు నిందితులు చెప్పిన మొత్తాన్ని చెప్పిన వారి బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేసింది. ఆ తర్వాత అదే నంబర్‌కు కాల్ చేస్తే ఫోన్‌లు స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.