బీజాపూర్‌లో ఆరుగురు మావోయిస్టుల హతం

బీజాపూర్‌లో ఆరుగురు మావోయిస్టుల హతం
ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లో మంగళవారం మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగిందని పోలీసులు ధ్రువీకరించారు. ఇప్పటి వరకు ఆరుగురు మావోలు మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. మృతుల్లో మోస్ట్‌ వాంటెడ్‌, మద్దేడు ఏరియా కమిటీ కమాండర్‌ పాపారావు భార్య ఊర్మిళ, నేషనల్‌ పార్కు ఏరియా కమిటీ ఇన్‌చార్జి బుచ్చన్న ఉన్నట్లు తెలుస్తోంది.
ఊర్మిళ మద్దేడు ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనలో పాపారావు తప్పించుకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌తో దక్షిణ బస్తర్‌ ప్రాతంలోని నేషనల్‌ పార్క్‌ పరిధిలో ఉన్న ఎయిడెడ్‌ కమిటీ దాదాపుగా తుడుచుపెట్టుకుపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలున్నారు. 
ఎన్‌కౌంటర్‌ను బీజాపూర్‌ ఎస్పీ జితేంద్ర యాదవ్‌ ధ్రువీకరించారు.  ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా దళాల బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొందని,ఈ సమయంలో అక్కడ దాక్కున్న మావోయిస్టులు కాల్పులు జరిపారని భద్రతా దళాలు దీటుగా బదులిచ్చాయని ఎస్పీ పేర్కొన్నారు. ఉదయం పది గంటల నుంచి కాల్పులు జరుగుతున్నట్లుగా ఆయన వివరించారు. డీఆర్‌జీ బీజాపూర్‌, దంతేవాడ, ఎస్‌టీఎఫ్‌ సంయుక్త బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని తెలిపారు.

ఈ సందర్భంగా ఇన్సాస్‌, స్టెన్‌గన్‌, 303 రైఫిల్స్‌తో పాటు ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ పీ మాట్లాడుతూ డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, బస్తర్‌ ఫైటర్స్‌, సీఆర్పీఎఫ్‌, సీఏఎఫ్‌ దళాలను చుట్టుపక్కల ప్రాంతాలకు పంపినట్లు ఐజీ పేర్కొన్నారు. 

ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ నలుగురు నక్సల్స్‌ను సంఘటనా స్థలంలోనే అరెస్టు చేసినట్లు బీజాపూర్‌ ఎస్పీ జితేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. సంఘటనా స్థలంలోనే వారికి చికిత్స అందించి, అంబులెన్స్‌ ద్వారా బీజాపూర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలను పంపించామని, కూంబింగ్‌ ముగిసిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ తెలిపారు.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా జాడను పోలీసులు ఇంతవరకు కనుక్కోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే తాజా గా వేల మంది బలగాలను రంగంలోకి దింపారు. పామేడు, అబూజ్‌మడ్‌, నేషనల్‌ పార్కు, కర్రెగుట్టల్లో గాలింపు ముమ్మరం చేశారు. హిడ్మా లొంగి పోవాలని, హిడ్మా ఇంటికెళ్లి ఛత్తీ్‌సగఢ్‌ హోంమంత్రి విజయశర్మ ఇటీవలే కోరారు.  అడవుల్లో ఇంకా సాయుధ పోరాటం చేస్తున్న కేంద్ర కమిటీ సభ్యులు గణపతి, బెహరా, పశులూరి విశ్వనాథం, కాకా హనుమంతు, మల్లా రాజిరెడ్డి, అనల్‌ధా, రణదేవ్‌, గోసం గాలింపు ముమ్మరం చేశారు.