నాగార్జునకు కొండా సురేఖ క్షమాపణలు

నాగార్జునకు కొండా సురేఖ క్షమాపణలు

సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంభం గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ నాగార్జునకు క్షమాపణలు చెబుతూ అర్ధరాత్రి సమయంలో సోషల్‌మీడియాలో ఒక పోస్టు పెట్టారు. గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కొండా సురేఖ తెలిపారు. ఆయన కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదని అని పేర్కొన్నారు. నాగార్జున కుటుంబం బాధపడి ఉంటే చింతిస్తున్నానని తెలిపారు.

తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. తన ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి నాంపల్లి ప్రత్యేక కోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఒక్క రోజు ముందు కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం గమనార్హం.

“నాగార్జున గారి గురించి నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే, దానికి నేను చింతిస్తున్నాను. నాగార్జున గారిని లేదా వారి కుటుంబ సభ్యులను కించపరచాలనే లేదా అపఖ్యాతి పాలు చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నా ప్రకటనల వల్ల ఏదైనా అపార్థం కలిగితే దానికి నేను చింతిస్తున్నాను. వాటిని ఉపసంహరించుకుంటున్నాను” అని మంత్రి కొండా సురేఖ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ గతంలో కొండా సురేఖ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారి వ్యక్తిగత అంశాలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో అక్కినేని నాగార్జున , కేటీఆర్ వేర్వేరుగా కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. అలాగే ఆ అంశాలకు సంబంధించిన కథనాలు ప్రచురించిన, వ్యాఖ్యలు చేసిన పలు యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్‌లు, వ్యక్తులపైనా పరువు నష్టం దావా దాఖలు చేశారు.
 
ఈ దావా విచారణ సమయంలో సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలు నాగార్జున గారి పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా, రాజకీయ నాయకులు లేదా ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా ఈ విషయంపై అక్కినేని కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడకుండా లేదా రాయకుండా ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. 
 
ఆ సమయంలోనే నాగార్జున నుంచి స్టేట్‌మెంట్ కూడా తీసుకుంది. అనంతరం విచారణకు రావాల్సిందిగా కొండా సురేఖకు కోర్టు సమన్లు కూడా జారీ చేసింది. అయితే అప్పటికే కొండా సురేఖ క్షమాపణలు చెప్పినట్లు ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు