జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్-బిఆర్ఎస్ కుట్రలకు ప్రజలు సమాధానం చెబుతారని, బిజెపిని గెలిపించి ప్రజలు న్యాయబద్ధమైన తీర్పు ఇస్తారనే పూర్తి నమ్మకం తమకుంబదని రాష్ట్ర బిజెపి చీఫ్ రాంచందర్‌రావు దీమా వ్యక్తం చేశారు. ఒకవైపు బిజెపిని మతోన్మాద పార్టీ అంటూ ముద్ర వేస్తూ, మరోవైపు తామే మతం పేరుతో ఓట్లు అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీయేనని ధ్వజమెత్తారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కిషన్ రెడ్డి-బిజెపి ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధి కోసం రూ.12 లక్షల కోట్లు కేటాయించిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 2014-2025 మధ్యకాలంలో రవాణా, విద్య, ఆరోగ్యం, పరిశోధన, మహిళా సాధికా రత, క్రీడలు, పర్యాటకం వంటి రంగాల్లో వందలాది ప్రాజెక్టులకు వేల కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఇవి హైదరాబాద్‌ను జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత మౌలిక సదుపాయాల నగరంగా మార్చాయని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో ఎరువుల కొరత, ఉద్యోగులకు జీతాల ఆలస్యం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని రామచందర్ రావు ఆరోపించారు. అనేక వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని చెబుతూ కేంద్ర ప్రభుత్వం పేదల కడుపు నిండా అన్నం పెట్టాలనే సంకల్పంతో సన్నబియ్యం పథకం అమలు చేస్తోందని తెలిపారు.
హైదరాబాద్‌లోని ఫార్మా, ఏరోస్పేస్, ఐటీ రంగాలకు మోడీ ప్రభుత్వం ప్రత్యేక మద్దతు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల విషయానికొస్తే ‘రైతు బంధు బంద్ పెట్టింది, రైతు భరోసా సరిగ్గా అమలు కాలేదు, రుణమాఫీ లేదు. పంట బోనస్ లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి లేదు. విద్యా భరోసా కార్డులు ఎక్కడ? తులం బంగారం ఎక్కడ?’ అని ప్రశ్నించారు.
గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో బీదల సొమ్ము దోచుకుంటూ వారి జీవితాలను ఆగం చేస్తోందని బిజెపి నేత ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఎంఐఎం, ఎంఐఎం అంటే కాంగ్రెస్ గా మారిందని మండిపడ్డారు. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన అభ్యర్థిని ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయిస్తున్నారని వెల్లడించారు.
బిజెపి నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు లేవని పేర్కొంటూ కానీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తూ, బిజెపి నాయకులు ప్రచారంలో పాల్గొనడం లేదంటూ తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Stories
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత
పాతబస్తీలో హిందూ మైనర్ అమ్మాయిలపై డ్రగ్స్ రాకెట్ పంజా
ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం