ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం

ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించేందుకు ఇక ఓటరు తీర్పే మిగిలి ఉంది. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 58 మంది పోటీ పడుతున్న ఈ ఉపఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు.
అయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మధ్యే ఉంది. బిఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బిజెపి తరఫున దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో 139 ప్రాంతాల్లో డ్రోన్లలో పటిష్టమైన నిఘా, 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 
 
ఇందులో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రతను పోలీసులు సిద్ధం చేస్తున్నారు జిహెచ్ఎంసి కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూంని ఏర్పాటు చేశారు.  అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణణ్ తెలిపారు.
 
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆ స్థానంలో ఉపఎన్నిక నవంబర్ 11వ తేదీన జరగనుంది. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. ఈ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పెద్దసంఖ్యలో స్వతంత్రులు, రైతులు, వివిధ పార్టీల నాయకులు పోటీపడుతున్నారు.

జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 6 గంటలతో ముగిసిందని ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. ఇంటింటి ప్రచారం మినహా ఏరకమైన ప్రచారం చేయకూడదని సూచించారు. బల్క్‌ మెసేజ్‌లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిషేధమని చెప్పారు. 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈసారి ఓటింగ్‌ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.