రాష్ట్ర రాజధాని ఆమరావతిలో ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. రాజధాని నుండి విజయవాడ నగరానికి నేరుగా కనెక్టివిటి ఏర్పాటు చేసే చర్యల్లో భాగంగా దీనిని చేపట్టనున్నారు. ఉండవల్లి సమీపంలోని కొండవీటి వాగు లిప్ట్ సమీపంలో ప్రారంభమయ్యే ఈ కారడార్ మణిపాల్ ఆస్పత్రి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారితో కలవనుంది. ఈ మేరకు ఆర్వీ అసోసియేట్స్ మాస్టర్‌ప్లాను రూపొందించింది.
దీని ప్రకారం ఉండవల్లి సమీపంలోని కొండవీటివాగు లిఫ్టు సమీపంలో ఉన్న గుంటూరు పంపింగ్ స్టేషన్ ట్యాంకు వెనుకభాగం నుండి కారిడార్ ప్రారంభమవుతుంది. ఇక్కడ దీనికి జంక్షన్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడ నుండే రెండోవైపు ప్రస్తుతం కొండవీటివాగుకు కృష్ణాపశ్చిమ కాలువ దగ్గర నిర్మించిన గేట్ల పక్కనే మరో స్టీల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. దీనికోసం ఇటీవల పిల్లర్లు కూడా వేశారు.
ఈ బ్రిడ్జి కెఎల్‌రావు కాలనీ వైపు పాత జాతీయ రహదారిపై దిగుతుంది. దీనికోసం అక్కడ నివాసాలు ఖాళీ చేయాలని ఇటీవల మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. కృష్ణా పశ్చిమ కాలువపై ఉండవల్లి వద్దనున్న వంతెన మీదుగా నిర్మాణం జరుగుతుంది. సీతానగరం కొండకు దక్షిణ భాగానికి ఆనుకుని బోట్‌యార్డు మీదుగా. కొల్‌కతా చెన్నై ట్రంక్‌రైల్వే లైను దాటుకుని కారిడార్‌ను నిర్మించనున్నట్లు మాస్టర్ ప్లానులో చూపించారు.
దీనికోసం అక్కడ ఆర్‌ఓబి నిర్మించనున్నారు. అనంతరం ఎన్‌టిఆర్ కట్టమీదుగా మణిపాల్ ఆస్పత్రి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై కలుపనున్నారు. దీనికోసం అక్కడ ట్రంపెట్ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు త్రీఆర్మ్ రోడ్డు నిర్మిస్తారు. దీనిలో ఒకటి విజయవాడ వైపుకు, రెండోది గుంటూరు వైపుకు అనుసంధానం చేయనున్నారు.
మొత్తం 3.50 కిలోమీటర్ల దూరం కారిడార్‌ను నిర్మించనున్నారు. . ఇందులో అమరావతి నుండి విజయవాడ వైపు మొదటి ర్యాంపు 232 మీటర్ల దూరం ఉండనుంది. గుంటూరు వైపు నుండి అమరావతికి వచ్చే రెండో ర్యాంపు 280 మీటర్ల దూరం నిర్మించనున్నారు. విజయవాడ నుండి అమరావతివైపు మూడో ర్యాంపు 115 మీటర్ల దూరం నిర్మిస్తారు.
2.46 కిలోమీటర్ల దూరం ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేస్తారు. దీనిలో రైల్ ఓవర్ బ్రిడ్జి 99.6 మీటర్లు ఉండనుంది. మొత్తం ప్రాజెక్టులో ఒక మేజర్, ఒక మైనర్ వంతెనలు ఉండనున్నాయి. రెండోచోట్ల వాహనాలకు వీలుగా అండర్‌పాస్‌లు కల్పిస్తారు. ఒకచోట ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్ నిర్మించనున్నారు.

More Stories
పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి
దుర్గగుడి అభివృద్ధికి త్వరితగతిన మాస్టర్‌ప్లాన్
జిఎస్టి ఆదాయం తగ్గడంపై ఏపీ ఆర్థికశాఖ ఆందోళన