జైషే మొహమ్మద్ ఉగ్రవాదిగా మారిన డాక్టర్!

జైషే మొహమ్మద్ ఉగ్రవాదిగా మారిన డాక్టర్!

* 350 కిలోల అమ్మోనియం నైట్రేట్, ఏకే-47 రైఫిళ్లు సీజ్

జమ్మూ కశ్మీర్‌లో డాక్టర్‌ ముసుగు వేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మొహమ్మద్ (జెఈఎం) ఆపరేటివ్‌ను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేయగా, అరెస్టు సమయంలోనే అతడి లాకర్ నుంచి ఏకే-47 తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అతడిచ్చిన సమాచారంతోనే భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. 
 
ముఖ్యంగా విచారణ సమయంలో అతడు చెప్పిన వివరాల ఆధారంగా హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఏకంగా 350 కిలోల అమ్మోనియం నెట్రేట్, ఒక ఏకే-47 రైఫిల్, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతనాగ్ జిల్లాలోని ఖాజీగుండ్‌కు చెందిన డాక్టర్ రథర్ శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) అనంతనాగ్‌లో మెడిసిన్ విభాగంలో రెసిడెంట్ డాక్టర్‌గా పని చేసేవాడు. 
 
అయితే 2024 అక్టోబర్ 24వ తేదీనే ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌కు బదిలీ అయ్యాడు. ప్రస్తుతం రథర్ ఇక్కడే పని చేస్తుండగా గత నెలలోనే శ్రీనగర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు సంబంధించిన ప్రచార పోస్టర్లను అంటించిన కేసులో ఈయన పేరు బయటకు వచ్చింది. దీంతో శ్రీనగర్ పోలీసులు రథర్‌ను సహార‌న్‌పూర్‌లో అరెస్ట్ చేశారు. ఆపై విచారణ జరపగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ముఖ్యంగా డాక్టర్ రథర్ ఇచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు అధికారులు జీఎంసీ అనంతనాగ్ కాలేజీ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లోనే డా. రథర్‌కు చెందిన వ్యక్తిగత లాకర్ నుంచి ఏకే-47 అసాల్ట్ రైఫిల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉగ్రవాద కార్యకలాపాల్లో అతనికి ఉన్న లింకులపై లోతుగా విచారణ జరపగా ఫరీదాబాద్‌లో ఉగ్ర సామగ్రిని దాచిన ప్రదేశం గురించి డా. రథర్ పోలీసులకు కీలక సమాచారం అందించాడు.

ఈ దాడుల్లో 350 కిలోల అమ్మోనియం నైట్రేట్, ఒక ఏకే-47 రైఫిల్ లభ్యం కావడం, దేశ భద్రతకు పెను ముప్పును నివారించినట్లుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మఫాజిల్ షకీల్ అనే మరో వైద్యుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  జమ్మూకశ్మీర్‌లోని చాలా మంది వైద్యులకు జైషే మహమ్మద్‌, ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలను ఈ ఘటనలు బలపరుస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 
ఈ కేసులో చాలా మంది అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపారు. శీతాకాలం కారణంగా ఉపరితల ప్రాంతాలైన రాంబన్‌, కిష్ట్‌వాడ్‌, దొడా, కఠువా, రియాసీ, పూంచ్‌, రాజౌరీ జిల్లాల్లో ఉగ్ర కార్యకలాపాలు సాగుతున్నాయన్న నిఘా సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డెన్‌ సర్చ్‌లు నిర్వహిస్తున్నాయి.