ఓటమి భయంతో సాయి తప్పి మాట్లాడుతున్న రేవంత్

ఓటమి భయంతో సాయి తప్పి మాట్లాడుతున్న రేవంత్

కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోయి తప్పి మాట్లాడుతున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్లేటప్పుడు, తాను ఏమి చేశాడో వివరించి, ఆ తర్వాత ప్రత్యర్థిని విమర్శిస్తూ ఓట్లు అడగాలని చెప్పారు. 

అయితే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదని,  కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన హామీలు ఏమాత్రం ఉన్నాయో ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదని విస్మయం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మళ్లించే వ్యూహంలో భాగంగానే బిజెపి నేతలపై, ప్రధానమంత్రిపై, బిజెపిపై తప్పుడు విమర్శలు చేస్తున్నాడని కేంద్ర మంత్రి మండిపడ్డారు.

బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిపోయాయని దిగజారుడు రాజకీయాలు రేవంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రచారమే చేశారని, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ తనపై వ్యక్తిగత విమర్శలు చేశాడని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

కేటీఆర్, కిషన్ రెడ్డిని ‘బ్యాడ్ బ్రదర్స్’ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని పేర్కొంటూ “ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే” (దొంగే పోలీసును బెదిరించినట్లు) ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎవరు ఎవరికి బ్రదర్స్? ఎవరు ఎవరిని కాపాడుతున్నారు? కేసీఆర్‌ను కాపాడుతోంది కాంగ్రెస్ కాదా? రాహుల్ గాంధీకి భయపడి ఎందుకు చర్యలు వెనకాడుతున్నావు, రేవంత్? తెలంగాణలో ‘బ్యాడ్ బ్రదర్స్’ ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి, కేసీఆరే అని స్పష్టం చేశారు.

తనను వ్యక్తిగతంగా విమర్శించినా, తప్పుడు ఆరోపణలు చేసినా, తన వ్యక్తిత్వాన్ని విమర్శించినా, ప్రజలు దానిని విశ్వసించలేదని గుర్తు చేశారు.
గత ఎన్నికల్లో ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రచారం చేసిన పార్టీ కాంగ్రెస్-బీఆర్‌ఎస్ అని పేర్కొంటూ జూబ్లీహిల్స్‌లో కూడా అదే పరిస్థితి నెలకొందని కిషన్ రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్ల అవినీతి డబ్బులు కక్కిస్తానన్న రాహుల్ గాంధీ లక్ష రూపాయలను కూడా బయటకు తీశాడా? అని ప్రశ్నించారు. 

ఢిల్లీ స్థాయిలో బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదరతాం వాస్తవం కాదా? అని నిలదీశారు.  చీము నెత్తురు ఉంటే, దమ్ము దైర్యం ఉంటే, ఏ విషయంలో బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయో చూపించాల్సిందిగా సవాల్ చేశారు.   ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది? ధాన్యం కొనుగోళ్ల కేసు ఏమైంది? భూముల కొనుగోళ్ల కేసు ఏమైంది? ఒక్క బీఆర్‌ఎస్ నేతలపై చర్యలు తీసుకున్నావా, రేవంత్ రెడ్డీ? ప్రచారంలో బీఆర్‌ఎస్‌పై ఎన్ని ఆరోపణలు చేశావో మర్చిపోయావా, రేవంత్ రెడ్డీ? అని ప్రశ్నించారు.