కేంద్రంలో సుస్థిరతకు రాష్ట్రంలోనూ బిజేపి బలపడాలి

కేంద్రంలో సుస్థిరతకు రాష్ట్రంలోనూ బిజేపి బలపడాలి
డా. వడ్డి విజయసారధి,
జాగృతి మాజీ సంపాదకులు, ప్రముఖ సామాజిక కార్యకర్త
 
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉంటే దేశం సురక్షితంగా ఉంటుంది. ఇక్కడ ‘మనోళ్లకు’ అధికారం కట్టబెట్టితేనే మనకు లాభదాయకం కదా ..అనుకొనే ధోరణి సరైనదేనా? ఇలా ఆలోచిస్తున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ విషయంపై వెలుగు ప్రసరింపజేసి చర్చించవలసి వస్తుంది.

2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ శాసన సభా నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థికి ఓటు వేసిన వారు ఇంచుమించు 26 వేలమంది. 2024 లోక సభ ఎన్నికల్లో బిజెపికి వోటు వేసిన వారు రెండున్నర రెట్లు,  65 వేల మంది.  ఈ 65 వేల మంది బిజేపికి నిబద్ధులైన వోటర్లేనని ఈ శాసనసభ ఉపఎన్నికలో వారందరూ మళ్లీ బిజేపి కే ఓటు వేస్తారని విశ్లేషకులు ఎందుకు భావించటం లేదు?

 
లోకసభ ఎన్నికల్లో దాదాపుగా 37 శాతం వోట్లు వచ్చినపార్టీ బలం ఇప్పటికీ 10-15 శాతం దగ్గరే ఉందని వారు ఎలా అనుకో గల్గుతున్నారు? 40 వేల మంది వోటర్లు కనబడకుండా మాయమై పోయారా? నేనైతే అలా అనుకోవడం లేదు. కాని వారి ఆలోచనల్లో, వాటి వ్యక్తీకరణలో ఉండవలసినంత దృఢత్వమూ, పట్టుదలా లేవు. ఇదే మీడియా మనుషులు, సర్వేబృందాల గుంపులూ తమకు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానించడానికి దారి తీస్తుంది. ఈ విషయాన్ని కొంచెం లోతుగా, మరింత విపులంగా మనం విశ్లేషించుకోవలసియున్నది.

దేశాన్ని కాంగ్రెసుకు అప్పగించినా, ప్రాంతీయ పార్టీలు కూటమికి అప్పగించినా భద్రంగా ఉండదు. సరిహద్దుల వద్దనే కాక డిల్లీలో, ముంబైలో, కాశీలో,నాగపూర్ లో హైదరాబాద్ లో , రైళ్లలో….దాడులు, బాంబుల ప్రేలుళ్లు సంభవిస్తాయి. కాబట్టి ఆ ప్రమాదాన్ని నివారించాలంటే కేంద్రంలో బిజేపీ ప్రభుత్వం ఉండాలి అని ఆలోచిస్తున్న వారు ఉత్తరాదిలోనో, గుజరాత్ మహారాష్ట్ర వంటి పశ్చిమప్రాంతాల్లోనో కాదు, దక్షిణాది  రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

కాబట్టే ఒంటరిగా పోటీచేసి కూడా తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ లోకసభకు బిజేపి అభ్యర్థులు గెలవగల్గుతున్నారు. కాగా ఇలా లోకసభకు బిజేపి అభ్యర్థులను గెలిపించి పంపించిన వారు కొందరు రాష్ట్ర శాసనసభల ఎన్నికలు వచ్చేసరికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. తమకు బాగా సన్నిహితులైన ఇతర పార్టీ అభ్యర్థులను, తమ కులం వారో, గోత్రంవారో అధికారంలోకి రాగల విధంగా శాసనసభకు వోటు వేయా లనుకొంటున్నారు.

శాసనసభ ఎన్నికల్లో నిర్మాణమయ్యే వాతావరణమే, లోకసభ ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తుందనే అంశాన్ని వారు గుర్తించటం లేదు.  ఈ విషయం అర్థమయ్యేందుకు రెండు ఉదాహరణలు ఇస్తాను. తెలంగాణలో బిజేపి లోకసభకు ఎనిమిది మందిని గెలిపించుకుంది.(అంతకు ముందున్నది  నలుగురే) ప్రజలు ఎవరిని చూసి వారికి వోటు వేశారు? అనుమానమే ముందున్నది? కేంద్రంలో ఉన్న ప్రధాన మంత్రిని చూసే వేశారు. 

 
మరి కాంగ్రెసు తరఫున కూడా ఎనిమిది మంది ఎన్నికైనారు గదా (అంతకు ముందున్నది ముగ్గురే) ఎవరిని చూసి వోటు వేస్తే ఇంతమంది ఎన్నికైనారు? రాహుల్ గాంధీని చూసి వోటు వేసినందునా? కానేకాదు. తెలంగాణలో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడినందున  ఇంతమంది ఎన్నికైనారు. తెలంగాణలో తెరాస/బి ఆర్ ఎస్ ప్రభుత్వం లేదు కాబట్టే టిఆర్ఎస్ కి ఉన్న పదిమంది ఎంపీలు ఓడిపోయారు.

ఆంధ్రప్రదేశ్ లోనూ ఇటువంటి పరిణామాలే గమనించవచ్చు. 2019 లోక్ సభ ఎన్నికల్లో అక్కడినుండి  వైఎస్ ఆర్ సీపీ నుండి 22 మంది ఎలా ఎన్నికైనారు? వీరందరూ ఆక్కడ డిల్లీలో ఏదో కీలకపాత్ర వహిస్తారని వారి సామర్థ్య నైపుణ్యాలను మెచ్చి ఎన్నుకున్నారా ప్రజలు? శాసనసభకు ఏ పార్టీకి వేశారో, ఆ పార్టీ అభ్యర్థికే లోకసభకూ వోటు వేసి గెలిపించారు.

కేంద్రంలో సుపరిపాలన సుస్థిరంగా కొనసాగవలెనంటే రాష్ట్రంలోనూ బిజేపి బలపడాలి.  నాటకరంగంలో ఒక సీనులో ఒక పాత్రవేషమూ మరొక సీనులో మరో పాత్రవేషమూ వేస్తూ లాభపడవచ్చుననే ఆలోచన లోప భూయిష్ఠ మని మనవి చేయడానికే ఈ రెండు మాటలు మీ ముందుంచాను. దీని లోతుపాతులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరని, రకరకాల వక్రగతులలో ఆలోచించే అవకాశం మీడియాకు ఇకపై ఇవ్వబోరని ఆశిస్తున్నాను.