మహారాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపుతున్న భారీ స్థాయి భూకుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ ఆధీనంలోని ఒక కంపెనీకి, ప్రభుత్వం అధిక విలువ గల భూమిని తక్కువ ధరకు రిజిస్టర్ చేసినట్టు ఆరోపణలు తలెత్తడంతో ప్రభుత్వం ఆ భూమి రిజిస్ట్రేషన్ ను రద్దు చేసింది. పుణెలోని ముద్వా ప్రాంతంలో ఉన్న 40 ఎకరాల ‘మహర్ వతన్’ భూమిని, నిరభ్యంతర (ఎన్‌వోసీ) పత్రం లేకుండానే అమేడియా ఎంటర్‌ప్రైజెస్‌కు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. అది ప్రభుత్వ భూమి అని, దాన్ని ప్రభుత్వేతర సంస్థలకు అమ్మడానికి వీల్లేదని వివరించారు.
అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్‌కు చెందిన అమెడియా ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.18,000 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని రూ.300 కోట్లకే విక్రయించినట్లు వెల్లడైంది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఇప్పటికే స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంపై ముందుగా పుణెలో నివసించే దిన్‌కర్ కోట్కర్ (60) అనే వ్యక్తి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజిఆర్) కార్యాలయానికి ఫిర్యాదు లేఖ రాసారు. కానీ, అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ అంశం గమనానికి రాలేదు. తర్వాత ఒక సామాజిక కార్యకర్త ఆ లేఖ కాపీని సేకరించి, రికార్డుల్లో మార్పులు చేసినట్లు (టాంపరింగ్) బయటపెట్టారు. దీనితో మొత్తం వ్యవహారం బయటపడింది.
విచారణ అధికారులు పరిశీలన చేపట్టగా, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనేక అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ భూమి విలువ కంటే తక్కువ మొత్తంలో లావాదేవీలు జరిపినట్టు నిర్ధారణ అయ్యింది. అంతేకాదు, రికార్డులు సవరించి అసలు విలువను దాచిపెట్టినట్లు కూడా విచారణలో బయటపడింది.
మరోవైపు ఈ ఆరోపణలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందిస్తూ తన మనవడు పార్థ్ పవార్ కంపెనీకి సంబంధించి వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరారు. ‘ముఖ్యమంత్రి ఈ విషయం తీవ్రంగా ఉందని స్వయంగా అన్నారు. అందుకే దీనిపై ఆయన సమగ్ర విచారణ జరిపి, నిజాలను ప్రజల ముందుకు తేవాలి’ అని స్పష్టం చేశారు.
“కుటుంబంగా మేమంతా ఒక్కటే, కానీ సిద్ధాంతపరంగా విభిన్నంగా ఉన్నాం. నా మనవళ్లలో ఒకరు అజిత్ పవార్‌కు వ్యతిరేకంగా పోటీ చేశారు. అలాగే అజిత్ భార్య నా కుమార్తెకు వ్యతిరేకంగా పోటీ చేశారు” అని గుర్తు చేశారు. అజిత్ పవార్‌పై మహాయుతి భాగస్వాములు రాజకీయంగా దాడి చేస్తున్నారా? అని విలేకర్లు అడగగా, అది తనకు తెలియదు అని సమాధానమిచ్చారు.

More Stories
కేవైసీ ఫోర్జరీ చేసి టీఎంసీ ఎంపీకి 56 లక్షలు టోకరా
అజిత్ పవర్ కుమారుడి `భూమి కుంభకోణం’పై దర్యాప్తు!
మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌ల ఆస్తుల జప్తు