మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి వీసా మంజూరు చేయరాదంటూ ట్రంప్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. అమెరికాకు వచ్చే వలసదారులు, పర్యాటకులను నిరుత్సాహపరిచేందుకు అధికారంలోకి వచ్చి నాటి నుంచి నిత్యం కొత్తకొత్త నిబంధనలు విధిస్తున్న ట్రంప్ సర్కారు తాజాగా ఆరోగ్యపరమైన మార్గదర్శకాలు జారీచేసింది.
ఈ మేరకు అమెరికా ఎంబసీలు, కాన్సులర్ కార్యాలయాలకు ఆ దేశ విదేశాంగ శాఖ మార్గదర్శకాలు జారీచేసినట్టు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకొనేవారు తప్పనిసరిగా ఆ దేశ దౌత్య కార్యాలయం గుర్తింపు పొందిన డాక్టర్ ద్వారా వైద్య పరీక్షను ఎదుర్కోవాలి. ఇప్పటివరకు దరఖాస్తుదారులకు టీబీ వంటి సంక్రమణ వ్యాధులు ఉన్నాయో లేదో పరీక్షలు చేస్తున్నారు. తాజాగా నిబంధనలను సవరించి మరిన్ని ఈ జాబితాలో చేర్చారు.
అంతేకాకుండా దరఖాస్తుదారుల మెడికల్ హిస్టరీని కూడా పరిశీలించనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని అమెరికాలోకి అనుమతిస్తే వారి వల్ల తమ దేశ ఖజానాపై అదనపు భారం పడుతుందా అన్న అంశాన్ని పరిశీలించి వీసా జారీపై నిర్ణయం తీసుకోనున్నారు. వారి వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుంది అనుకుంటే వారి వీసాను తిరస్కరించేలా నిబంధనలను కఠినతరం చేశారు.
గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, జీవక్రియకు సంబంధించిన రుగ్మతలు, నాడీ సంబంధత వ్యాధులు, మానసిక రుగ్మతలు ఉన్న వారిని అనుమతిస్తే వారి వల్ల లక్షల డాలర్లు ఖర్చయ్యే అవకాశం ఉంటుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నది. ఊబకాయం వల్ల ఆస్తమా, నిద్రలేమి, హై బీపీ వంటి వ్యాధులు వచ్చే అవకాశమున్నందున వారికి వీసాలిచ్చే విషయంలోనూ జాగ్రత్త వహించాలని సూచించింది. వీసా కోసం దరఖాస్తు చేసుకొనే వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్రను కూడా పరిశీలించాలని ఆ మార్గదర్శకాలలో పేర్కొంది.
వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? వారిని అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుందా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని వీసా జారీపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశమున్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకుండా వీసాను తిరస్కరించేలా నిబంధనలను కఠినతరం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. ఒకవేళ వలసదారులు అమెరికా ప్రభుత్వ సాయం లేకుండా వైద్య చికిత్సలను సొంతంగా భరించగలరా లేదా? అన్నది కూడా నిర్థారించుకోవాలని వీసా అధికారులను ఆదేశించారు.

More Stories
చట్టవిరుద్ధంగా అణుకార్యకలాపాలు పాక్ కు అలవాటే
భారత్ నాలుగో టీ20లో ఘన విజయం
80 వేలకు పైగా వలసేతర వీసాలు రద్దు!