దుర్గగుడి అభివృద్ధికి త్వరితగతిన మాస్టర్‌ప్లాన్‌

దుర్గగుడి  అభివృద్ధికి త్వరితగతిన మాస్టర్‌ప్లాన్‌

రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందిన ఇంద్రకీలాద్రిని దాతల సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పాలకమండలి తొలి సమావేశంలో సభ్యులు తీర్మానించారు. డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీదీక్ష విరమణలను దసరా తరహాలో నిర్వహించి భక్తుల సంతృప్తి పొందేలా పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ బొర్రా రాధా కృష్ణ, గాంధీ అధ్యక్షతన తొలి సమావేశంలో ప్రధానంగా 26 అంశాలపై చర్చించారు. అజెండాలోని 18 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇంద్రకీలాద్రి కొండపై ప్రైవేటు వ్యక్తులతో వ్యాపారాలు లేకుండా వారికి కేటాయించిన ప్రదేశంలోనే జరిగేలా తగిన మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. 

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కనకదుర్గానగర్‌ మీదుగానే రాకపోకలు సాగించేలా చూడాలని, ఘాట్‌రోడ్డుపై వాహనాల రాకపోకలను చాలా వరకు తగ్గించాలని సూచించారు. దాతల సహకారంతో బంగారు రథాన్ని ఆదిదంపతుల ఊరేగింపునకు తయారు చేయించే విషయమై సభ్యులు చర్చించారు. కనకదుర్గమ్మ ఆలయానికి పాక్షికంగా స్వర్ణతాపడం ఉందనీ, పూర్తి స్వర్ణ తాపడం చేయించే విషయమై దాతల నుంచి సహకారం తీసుకునేందుకు ముందుగా ఆలయ అభివృద్ధిని పట్టాలెక్కించాలని తెలిపారు.

మల్లేశ్వరస్వామి ఆలయానికి కూడా బంగారు తాపడం చేయించే విషయంపైనా సభ్యులు చర్చించారు. టెండర్లను నిష్పక్షపాతంగా పిలిచి కొత్త గుత్తేదారులను ఆహ్వానించే విషయమై సభ్యులు పలు సూచనలను చేశారు. “భవిష్యత్తులో దుర్గగుడిని మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా చర్యలను చేపట్టనున్నాం. ఇంద్రకీలాద్రి కొండపై ప్రైవేటు వ్యక్తులతో వ్యాపారాలు లేకుండా వారికి కేటాయించిన ప్రదేశంలోనే జరిగేలా తగిన మార్పులు చేయాలని అధికారులను ఆదేశించాం” అని రాధాకృష్ణ తెలిపారు. 

“డిసెంబరు 11 నుంచి 15 వరకు భవానీదీక్ష విరమణలు జరగనున్నాయి. దసరా తరహాలో ఈ కార్యక్రమాన్ని సైతం నిర్వహించి భక్తుల సంతృప్తి పొందేలా పక్కా ఏర్పాట్లు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మాస్టర్​ప్లాన్​ను అనుసరించి భక్తుల సంతృప్తి పొందేలా పకడ్బందీగా ఏర్పాట్లను చేస్తున్నాం” అని ఈఓ  శీనానాయక్‌ తెలిపారు.