చట్టవిరుద్ధంగా అణుకార్యకలాపాలు పాక్ కు అలవాటే

చట్టవిరుద్ధంగా అణుకార్యకలాపాలు పాక్ కు అలవాటే
ప్రపంచంలో అణ్వాయుధాలను పరీక్షిస్తున్న దేశాల్లో పాకిస్థాన్‌ కూడా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రహస్యంగా, చట్టవిరుద్ధంగా అణు కార్యకలాపాలు కొనసాగించడంలో పాక్‌కు దశాబ్దాల చరిత్ర ఉందని పేర్కొంది. 
 
స్మగ్లింగ్‌, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు దశాబ్దాలుగా పాకిస్థాన్‌కు అలవాటేనని, ఏక్యూ ఖాన్‌ నెట్‌వర్క్‌ విస్తరణ చుట్టూ ఇది కేంద్రీకృతమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. ఈ అంశాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి భారత్ ఎల్లప్పుడూ తీసుకెళ్తూనే ఉంటుందని తెలిపారు. 

“రహస్యంగా, చట్టవిరుద్ధంగా అణు కార్యక్రమాలను కొనసాగించడం పాకిస్థాన్‌ చరిత్రలోనే ఉంది. స్మగ్లింగ్‌, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్యం భాగస్వామ్యాలు, ఏక్యూ ఖాన్‌ నెట్‌వర్క్‌ విస్తరణ దశాబ్దాలుగా పాకిస్థాన్‌కు అలవాటే. ఈ అంశాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి భారత్‌ తీసుకెళ్తుంది. పాకిస్థాన్‌ అణు పరీక్షలు కొనసాగిస్తుందని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను మేము పరిశీలిస్తున్నాం”అని జైస్వాల్ తెలిపారు.

కాగా, 2026 భారత్‌లో పర్యటిస్తానని డొనాల్డ్ ట్రంప్‌ చేసిన ప్రకటన గురించి అడిగిన ప్రశ్నకు స్పందించిన జైశ్వాల్‌, దీనిపై ప్రస్తుతానికి తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. గత ఆదివారం ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్, అమెరికా మళ్లీ అణుపరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాదు పాకిస్థాన్, ఉత్తర కొరియా సహా అనేక దేశాలు భూగర్భ అణుపరీక్షలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

మరోవైపు భారత్ను ఎదుర్కోవడమే లక్ష్యంగా పాకిస్థాన్ అణ్వస్త్రాలను తయారు చేసుకుందని మాజీ సీఐఏ అధికారి రిచర్డ్ బార్లో తెలిపారు. అయితే పాక్ అణు కార్యక్రమాల రూపశిల్పి అబ్దుల్ ఖదీర్ ఖాన్ (ఏక్యూ ఖాన్) మాత్రం ఈ న్యూక్లియర్ బాంబ్ సాంకేతికతను పాక్తో పాటు, ఇరాన్ సహా ఇస్లామిక్ దేశాలు అన్నింటికీ అందించాలని భావించారని బార్లో తెలిపారు. 

ఇదే ఇప్పుడు ఇస్లామిక్ బాంబ్గా పరిణామం చెందిందని ఆయన పేర్కొన్నారు. 1980ల్లో పాక్ రహస్య అణ్వస్త్ర కార్యకలాపాలు నిర్వహించింది. ఆ సమయంలో రిచర్డ్ బార్లో సీఐఏ ఏజెంట్గా ఉన్నారు. ఆయన ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు తెలియజేశారు.

“ఏక్యూ ఖాన్ 1990ల ప్రారంభంలో ఇరాన్కు కీలకమైన గ్యాస్ సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీని, బహుశా అణ్వాయుధ ప్రణాళికను అందించాడు. 1974లోనే అణ్వాయుధాలను సమకూర్చుకున్న భారత్ను ఎదుర్కోవడమే లక్ష్యంగా పాక్ మొదట్లో వ్యూహాత్మక అణు కార్యకలాపాలు చేపట్టింది. కానీ ఏక్యూ ఖాన్ సహా పాక్ మిలటరీ జనరల్స్ దృక్కోణం నుంచి చూస్తే అది కేవలం పాకిస్థానీ బాంబు కాదు. అది ఇస్లామిక్ బాంబ్, ముస్లిం బాంబ్” అని బార్లో పేర్కొన్నారు.