భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఆసియా కప్ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఒమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పంకజ్ ఖిమ్జీ నేతృత్వం వహించనున్నారు. గతంలో పలు వివాదాల సమయంలో ఆయన మధ్యవర్తిత్వం వహించారు. ఓ నివేదిక ప్రకారం ఐసీసీ బోర్డు సమావేశంలో బీసీసీఐ ఆసియా కప్ ట్రోఫీ వివాదాన్ని లేవనెత్తింది.
దాంతో ఐసీసీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో పాక్‌పై భారత్ విజేతగా నిలిచింది. అయితే, పీసీబీ, ఏసీసీ చైర్మన్‌గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని ప్రదానం చేసేందుకు వేదికపైకి రాగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించాడు.
నక్వి పాక్ హోం మంత్రిగా కొనసాగుతుండడంతో ట్రోఫీని అందుకునేది లేదని స్పష్టం చేశాడు. భారత్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడంలో ఆయన పాత్రపై అభ్యంతరాలు వ్యక్తం ట్రోఫీని అందుకునేందుకు సూర్య నిరాకరించినట్లు నివేదికలు తెలిపాయి. ఏసీసీ అధ్యక్షుడిగా ట్రోఫీని ప్రదానం చేసే అధికారం తనకు మాత్రమే ఉందని నఖ్వీ స్పందించగా, ఆ తర్వాత ట్రోఫీ లేకుండానే టీమిండియా సంబురాలు చేసుకుంది.
దాంతో నొచ్చుకున్న నఖ్వీ ఆసియా కప్, మెడల్స్‌ను తీసుకెళ్లిపోయారు. ఐసీసీ బోర్డు సమావేశంలో బీసీసీఐ ఈ అంశాన్ని లేవనెత్తగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి బోర్డులు రెండుదేశాలను శాంతింప చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమావేశానికి పీసీబీ చైర్మన్ నఖ్వీ సైతం హాజరయ్యారు. భారత్, పాక్ రెండు క్రికెట్ ప్రపంచంలో కీలకమైన సభ్యదేశాలని, విభేదాలను పరిష్కరించేందుకు ఐసీసీ బోర్డు అంగీకరించదని మీడియా నివేదికలు తెలిపాయి.
పాక్ సెనేట్ కీలక సమావేశం వాయిదా పడినందున నఖ్వీ చివరి నిమిషంలో దుబాయిలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ట్రోఫీ వివాదాన్ని పరిష్కార బాధ్యతలను ఒమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఖిమ్జీపై ఉండగా, రెండుదేశాల బోర్డులతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. దాంతో వివాదం సమసిపోతుందని ఐసీసీ భావిస్తున్నది.

More Stories
టీ20 సిరీస్ విజేతగా టీమిండియా!
మధుమేహం, ఊబకాయం ఉంటె అమెరికా వీసా కష్టమే!
పాక్ అణుకేంద్రంపై దాడిని అడ్డుకున్న ఇందిరా గాంధీ!