తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ సైబర్ మోసానికి గురై, సుమారు రూ.56 లక్షలు నష్టపోయారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కళ్యాణ్ బెనర్జీ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉపయోగించిన కోల్‌కతాలోని భారతీయ స్టేట్ బ్యాంక్, హైకోర్టు శాఖలో ఉన్న ఈ ఖాతా కొన్నేండ్లుగా క్రియాశీలంగా లేదు. సైబర్ నేరగాళ్లు ఆయన కేవైసీ వివరాలను అప్డేట్ చేయడం కోసం ఫోర్జరీ చేసిన ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించారు.
2001 నుంచి 2006 వరకు అసన్సోల్ సౌత్ నియోజకవర్గం నుంచి కళ్యాణ్ బెనర్జీ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఇతర ఎమ్మెల్యేలతోపాటు కళ్యాణ్ బెనర్జీ పేరు మీద ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్రాంచ్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేశారు. ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చే అన్ని అలవెన్సులను ఆ అకౌంట్లోనే జమ చేసేవారు. అయితే చాలా కాలంగా ఆ అకౌంట్లోలావాదేవీలు జరగకపోవడంతో అది డార్మెంట్ అకౌంట్‌గా మారిపోయింది.
సైబర్ నేరగాళ్లు సరిగ్గా ఈ అకౌంట్ ఇన్ యాక్టివ్‌గా ఉన్న అకౌంట్‌ను టార్గెట్ చేసుకుని ఈ సైబర్ మోసానికి పాల్పడ్డారు. సైబర్ నేరగాళ్లు ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఫోటో, ఇతర వివరాలను ఉపయోగించి నకిలీ పాన్ కార్డు, ఆధార్ కార్డులను సృష్టించారు. ఆ తర్వాత ఆ నకిలీ పత్రాలను ఉపయోగించి డార్మెంట్ అకౌంట్‌కు సంబంధించిన కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు.
అనంతరం ఆ అకౌంట్‌కు లింక్ అయి ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను మార్చేశారు. ఇక ఈ మార్పులు మొత్తం పూర్చి చేసిన తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించి పలుమార్లు లావాదేవీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే విడతల వారీగా మొత్తం రూ.56 లక్షలు ఆయన అకౌంట్ నుంచి డబ్బులు కాజేశారు.
దొంగిలించిన మొత్తాన్ని వేర్వేరు అకౌంట్లకు బదిలీ చేయడమే కాకుండా ఆ డబ్బుతో బంగారం కొనుగోలు చేసి,కొంత మొత్తాన్ని ఏటీఎంల ద్వారా కూడా విత్‌డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ భారీ మోసాన్ని గుర్తించిన బ్యాంక్ అధికారులు వెంటనే కోల్‌కతా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని కోల్‌కతా సైబర్ క్రైమ్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

More Stories
అజిత్ పవర్ కుమారుడి `భూమి కుంభకోణం’పై దర్యాప్తు!
మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌ల ఆస్తుల జప్తు
మహిళలకు నగదు బదిలీలతో రాష్ట్రాల ఖజానాలుఖాళీ!