జిఎస్‌టి ఆదాయం తగ్గడంపై ఏపీ ఆర్థికశాఖ ఆందోళన

జిఎస్‌టి ఆదాయం తగ్గడంపై ఏపీ ఆర్థికశాఖ ఆందోళన

జిఎస్‌టి సంస్కరణల వల్ల ఆదాయం తగ్గడంపై ఏపీ ఆర్థికశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలన్న కోణంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. గతంలో ఆదాయం పెంపుకోసం డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌, కొంతమంది నిపుణులు ఇచ్చిన సూచనలను ఇప్పుడు తెరపైకి తీసుకువస్తున్నారు. ఈ సూచనలు అమలు చేస్తే ప్రజలపై ఎంతో కొంత భారం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

అక్టోబర్‌ నెలకు సంబంధించిన గణాంకాల మేరకు గతఏడాది కన్నా రూ. 325 కోట్లు జిఎస్‌టి తగ్గినట్లు తేలడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాగే సెప్టెంబర్‌కన్నా కూడా అక్టోబర్‌లో రూ. 163 కోట్లు తగ్గినట్లు తేలింది. వాస్తవానికి జిఎస్‌టి-2 ప్రకటించిన వెంటనే కనీసం ఎనిమిది వేల కోట్లు తగ్గుదల ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.

గతంలో డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ కూడా ఆదాయం పెంపుకోసం కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచింది. ఇప్పుడు ఆ ప్రతిపాదనలనే ప్రభుత్వం తెరపైకి తీసుకువస్తోంది. గత కలెక్టర్ల సదస్సులో కూడా జిఎస్‌టి నష్టాలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయగా, ఇప్పుడు ఆ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని మరోసారి స్పష్టం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

పెండింగ్‌ బకాయిలను ముక్కుపిండి వసూలు చేయడం, ఎగవేత దారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసి కేసులు పెట్టడం, చిరు వ్యాపారులు కూడా తప్పనిసరిగా పన్నులు చెల్లించేలా చూసేందుకు తప్పనిసరి రిజిస్ట్రేషన్లు అమలు చేయడం వంటి చర్యలను తప్పనిసరిగా అమలు చేయనున్నారని సమాచారం.

ఇన్నాళ్లూ పథకాలకు ఇస్తున్న రాయితీలపైనా మరోసారి దృష్టి సారిస్తున్నారు. గతంలోనే డిఆర్‌ఐ ఇచ్చిన నివేదికను ఇప్పుడు బయటకు తీసి పథకాల స్థానంలో నగదు బదిలీ చేయాలని, అది కూడా అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలన్న నిర్ణయాన్ని త్వరలో అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం దీనిపైనా చర్చ సాగినట్లు అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కొంతవరకు వ్యయం తగ్గుతుందని ఆర్థికశాఖ చెబుతోంది.

ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో గనుల శాఖ, మద్యం శాఖలపైనా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. మద్యంపై కొత్తగా అదనపు వ్యాట్‌ విధించే అవకాశాలున్నాయని ఒక అధికారి చెప్పారు. అలాగే గనుల ద్వారా వచ్చే ఆదాయం నామనాత్రంగా ఉంటోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పర్యాటక రంగంలో కూడా ఫీజులను పెంచడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని యోచిస్తున్నారు.