అణ్వాయుధ పరీక్షలను తాము తిరిగి ప్రారంభిస్తామని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అణు పరీక్షలను తిరిగి ప్రారంభించడానికి ప్రతిపాదనలు సమర్పించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కీతమ అధికారులను బుధవారం ఆదేశించారు. భద్రతా మండలితో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ముందుగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభిస్తే, మాస్కో కూడా అణు పరీక్షలను తిరిగి ప్రారంభిస్తుందని పుతిన్ తన మునుపటి ప్రకటనను పునరుద్ఘాటించారు.
ఈ క్రమంలోనే వాషింగ్టన్ ఉద్దేశాలను విశ్లేషించి, అణు పరీక్షలను తిరిగి ప్రారంభించడానికి ప్రతిపాదనలను రూపొందించాలని రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు. 30 ఏళ్ల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను తాము తిరిగి ప్రారంభిస్తున్నామని అక్టోబరు 30న ట్రంప్ ప్రకటించారు. అణ్వాయుధాల విషయంలో అమెరికా, రష్యా, చైనా ఐదేళ్లలోపు సమాన స్థాయికి చేరుకునే అవకాశముందని వెల్లడించారు.
అయితే అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ ఆదివారం ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ట్రంప్ ఆదేశించిన అమెరికా అణు ఆయుధ వ్యవస్థ కొత్త పరీక్షలలో అణు విస్ఫోటనాలు ఉండవని పేర్కొన్నారు. కాగా, అమెరికా సైన్యం గతంలో క్రమం తప్పకుండా అణ్వాయుధాలను పరీక్షించేది. కానీ 1992 నుంచి అణు పరీక్షలను ఆపేసింది. ఒక్క ఉత్తర కొరియా మాత్రమే ప్రస్తుతం అణు పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే మళ్లీ 30 ఏళ్ల తర్వాత అమెరికా అణు పరీక్షలకు సిద్ధమవుతోంది.
కాగా, 2023లో పుతిన్ ప్రపంచ అణు పరీక్ష నిషేధాన్ని రష్యా ఆమోదించడాన్ని రద్దు చేసే బిల్లుపై సంతకం చేశారు. ఈ క్రమంలో మళ్లీ అణు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బుధవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ తమ అణు ఆయుధశాలలను ఆధునీకరించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల గురించి పుతిన్‌కు నివేదించారు.
వాషింగ్టన్ అణు పరీక్షలను తిరిగి ప్రారంభిస్తే, అవి రష్యాకు సైనిక ముప్పుల స్థాయిని గణనీయంగా పెంచుతాయని తెలిపారు. ఆర్కిటిక్ నోవాయా జెమ్లియా ద్వీపసమూహంపై మాస్కో వెంటనే అణు పరీక్షలకు సన్నాహాలు ప్రారంభించాలని సూచించారు. 1990లో సోవియట్ యూనియన్ చివరిసారిగా అణ్వాయుధాన్ని పరీక్షించిన ప్రదేశం ఇదేనని, మళ్లీ అక్కడే అణు పరీక్షలు జరపాలని సూచించారు.
మరోవైపు, అణు పరీక్షలకు సన్నాహాలు ప్రారంభించాలని పుతిన్ ఆదేశించలేదని, ప్రస్తుతానికి అలాంటి పనిని ప్రారంభించడం అవసరమా అని విశ్లేషించమని మాత్రమే అధికారులకు చెప్పారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. తదుపరి నిర్ణయాలు తీసుకునే ముందు అమెరికా ఉద్దేశాలను మాస్కో పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

More Stories
భారత్ నాలుగో టీ20లో ఘన విజయం
80 వేలకు పైగా వలసేతర వీసాలు రద్దు!
నేపాల్ లో 10 వామపక్ష పార్టీల విలీనం