అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసేతర వీసాలపైనా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 80 వేలకు పైగా వలసేతర వీసాలను రద్దు చేసినట్లు తెలిసింది. అందులో హింస, చోరీలకు పాల్పడటం కేసుల నుంచి మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినవారే అధికంగా ఉన్నట్లు సమాచారం.
జనవరిలో అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వెట్టింగ్తోపాటు స్క్రీనింగ్‌ను విస్తృతం చేశారు. అమెరికా చట్టాలను ఉల్లంఘించేవారి వీసాల రద్దును ముమ్మరం చేశారు. గతంతో పోలిస్తే వీసాల రద్దు రెట్టింపు అయినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. జనవరి నుంచి మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన 16వేల మంది వీసాలను రద్దు చేసినట్లు తెలిసింది.
దీంతో పాటు దాడులతో ప్రమేయమున్న 12వేల మంది, చోరీ కేసులు నమోదైన 8వేల మంది వీసాలు రద్దు అయినట్లు సమాచారం. వీసాలు రద్దయినవారిలో ఈ మూడు విభాగాల నుంచే దాదాపు సగం మంది ఉన్నట్లు అంచనా. జనవరి నుంచి 80 వేలకు పైగా వీసాలను రద్దు చేశారని, అందులో 8వేల విద్యార్థి వీసాలు ఉన్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ ఓ కథనంలో పేర్కొంది.
ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా అమెరికాలో ఉండటంతోపాటు స్థానిక చట్టాలను ఉల్లంఘించిన 6వేలకుపైగా విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అగ్రరాజ్యం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. వారిలో కొందరు ఉగ్రవాదానికి మద్దతు తెలిపినవారు ఉన్నట్లు చెప్పారు.
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరుగురి వీసాలను అమెరికా యంత్రాంగం రద్దు చేసింది. తమ విదేశాంగ విధానానికి విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గతంలో ఓ సందర్భంలో ఇప్పటికే ప్రకటించారు. ఈ సంఖ్య వందలు, వేలల్లో ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అందుకు తగినట్లుగానే వేలాది సంఖ్యలో వీసాలు రద్దు చేసినట్లు సమాచారం.
కాగా, తమ దేశానికి ముప్పుగా పరిణమించే వీసా దరఖాస్తుదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విదేశాల్లోని తమ దౌత్యవేత్తలకు అమెరికా విదేశాంగశాఖ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. పాలస్తీనీయన్లకు మద్దతుగా లేదా గాజాలో ఇజ్రాయెల్ చర్యలను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేసే విద్యార్థులు, గ్రీన్‌కార్డుదారులకు బహిష్కరణ ముప్పు తప్పదని హెచ్చరించినట్లు తెలిసింది. ఇలాంటి వ్యాఖ్యలు హమాస్ భావజాలాన్ని ప్రతిబింబించడంతోపాటు అమెరికా విదేశీ విధానాన్ని ప్రమాదంలో పడేస్తాయని అభిప్రాయపడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.

More Stories
భారత్ నాలుగో టీ20లో ఘన విజయం
ట్రంప్ వ్యాఖ్యలతో అణుపరీక్షలకు పుతిన్ ఆదేశం!
నేపాల్ లో 10 వామపక్ష పార్టీల విలీనం