మహిళలకు నగదు బదిలీలతో రాష్ట్రాల ఖజానాలుఖాళీ!

మహిళలకు నగదు బదిలీలతో రాష్ట్రాల ఖజానాలుఖాళీ!
దేశంలోని అనేక రాష్ట్రాలు సంక్షేమ పథకాల అమలు కోసం మహిళల బ్యాంక్‌ ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీలు చేస్తున్నాయి. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మాత్రమే ఈ పధకాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడుతూ అమలు పరుస్తున్నాయి. ఇటువంటి పధకాల కారణంగా మిగులు రాష్ట్రాలు సహితం అప్పులమయం అవుతున్నాయని ఆర్హ్దిక నిపుణులు హెచ్చరిస్తున్నా ఎన్నికల రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. 
2022-23లో కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే ఈ విధంగా నగదు బదిలీలు చేసేవి. ఇప్పుడు వాటి సంఖ్య 12కు చేరింది. ఈ ఏడాది మహిళల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.1,68,050 కోట్లు జమ చేయాలని ఆయా రాష్ట్రాలు భావిస్తున్నాయి.  ఇది జీడీపీలో 0.5 శాతానికి సమానమని పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రిసెర్చ్‌ సంస్థ తెలిపింది. రెండు సంవత్సరాల క్రితం ఇది 0.2 శాతం కంటే తక్కువగానే ఉంది. 
 
కర్నాటకలో గృహలక్ష్మి కానివ్వండి, మధ్యప్రదేశ్‌లో లడ్లీ బెహనా కానివ్వండి, మహారాష్ట్రలో లడ్కీ బెహిన్‌ కానివ్వండి, బీహార్‌లో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన కానివ్వండి…పథకం పేరు ఏదైనా, పాలక పార్టీ ఏదైనా ఎన్నికలకు ముందు ఓటర్లను త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి, తమ వైపు తిప్పుకోవడానికి నగదు బదిలీలను అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానా గుల్ల అవుతున్నప్పటికీ లబ్దిదారులు మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
బేషరతు నగదు బదిలీ పథకాల అమలులో జార్ఖండ్‌ మొదటి స్థానంలో ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన అస్సాం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఈ పథకాలకు నిధుల కేటాయింపు పెంచాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనాలతో పోలిస్తే అస్సాం ప్రభుత్వం కేటాయింపులను 31 శాతం, బెంగాల్‌ ప్రభుత్వం 15 శాతం పెంచేశాయి. జార్ఖండ్‌లో సీఎం మయాన్‌ సమ్మాన్‌ యోజన పథకం కింద ఇస్తున్న నెలసరి మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రెండున్నర వేల రూపాయలకు పెంచారు. 
ఖజానా ఖాళీ అవుతుండడంతో కొన్ని రాష్ట్రాలు నగదు బదిలీ పథకాలను అటకెక్కించాయి. కొన్నింటిలో కోత పెట్టాయి. ఉదాహరణకు మహారాష్ట్రలో సీఎం లడ్కీ బహిన్‌ యోజన కింద నెలకు ఇస్తున్న రూ.1,500లను రూ.500కు తగ్గించారు. తొలుత  ఒడిషాలో రైతులకు అమలు చేసిన నగదు బదిలీ పథకం ఇప్పుడు దేశమంతటా క్రమేపీ విస్తరిస్తోంది. సబ్సిడీలు, వ్యవసాయ రుణాల మాఫీలు, నగదు బదిలీలపై ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆర్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. 
 
నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్న 12 రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు తప్పదని అంచనా. మిగులు రెవెన్యూ కలిగిన కర్నాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు నగదు బదిలీ పథకాలను అమలు చేస్తూ లోటును ఎదుర్కొంటున్నాయి.