మొంథా తుఫాన్ బాధిత రైతులకు పంటల  భీమా ప్రశ్నార్ధకం!

మొంథా తుఫాన్ బాధిత రైతులకు పంటల  భీమా ప్రశ్నార్ధకం!
మొంథా తుఫాన్‌ వల్ల వ్యవసాయ పంటలకు రూ.829 కోట్ల మేర నష్టం సంభవించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రాధమిక అంచనా వేసింది. అయితే పంటలు నష్టపోయిన రైతులలో చాలామందికి భీమా ప్రయోజనం కలిగే అవకాశం కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం పంటల భీమా పధకాన్ని రైతుల అభిష్టంకు వదిలివేయడం,  టిడిపి కూటమి ప్రభుత్వం అంతకు ముందు వరకు ఉన్న ఉచిత పంటల బీమాను ఎత్తేసి రైతులే తమ వాటా ప్రీమియాన్ని చెల్లించుకోవాలని చెప్పడంతో అత్యధికంగా రైతులు పంటల భీమా పరిధిలోకి వచ్చే అవకాశం లేదు.
 
తుపాన్ సృష్టించిన విలయానికి లక్షల ఎకరాల్లో పంట నష్టాలను చవిచూసిన రైతులకు అందాల్సిన కొద్దిపాటి బీమాకు దూరం కాగలరని తెలుస్తున్నది. ఖరీఫ్ లో  వ్యవసాయ, ఉద్యానవన పంటలన్నీ కలుపుకొని కోటి ఎకరాలకు పైగా రైతులు సాగు చేయగా అక్టోబర్ చివరాఖరికి దిగుబడి ఆధారిత (ఫసల్), వాతావరణ ఆధారిత.. రెండు బీమా పథకాల్లో చేరిన విస్తీర్ణం 19.57 లక్షల ఎకరాలు మాత్రమే. 
 
తమ పంటలకు భీమా చేయించుకున్న రైతులు సుమారు ఏడున్నర లక్షల మంది. నిరుడు ఖరీఫ్ లో రెండు బీమా పథకాలూ కలిపి 71 లక్షల ఎకరాలు బీమా కిందికి వచ్చాయి. దాదాపు 32 లక్షల మంది రైతులు తమ పంటలకు బీమా చేయించుకున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా గత ఖరీఫ్ కంటే ఈ ఖరీఫ్ లో భారీగా బీమా చేయించిన విస్తీర్ణం, రైతుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు స్పష్టం అవుతుంది.
 
కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకొస్తే రైతులు, కౌలు రైతులందరినీ ఆదుకునేలా సమగ్ర పంటల బీమా తీసుకొస్తామని హామీ ఇచ్చింది. తర్జన భర్జనల అనంతరం వైసిపి హయాంలో మోదీ సర్కార్ ఒత్తిడితో ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలకే సుముఖత వ్యక్తం చేసింది. అప్పటి వరకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించగా, ఆ విధానానికి స్వస్తి పలికి రైతులనే కట్టుకోమంది. 
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వం బీమాను రైతుల ఇష్టాయిష్టాలకే వదిలేసింది. అంతకుముందు వరకు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకునే రైతులకు బీమా తప్పనిసరి. బ్యాంకులే ఆ పని చేసేవి. కానీ కేంద్రం ఆ విధానాన్ని ఎత్తేసింది. రైతులు తమ సమ్మతి తెలిపితేనే బ్యాంకులు పంటలకు బీమా చేయాలంది. తామే ప్రీమియం కట్టుకోవాల్సి రావడంతో, అసలే సాగు గిట్టుబాటుకాక ఆర్థిక సంక్షోభంలో ఉన్న రైతులు, కౌలు రైతులు బీమా జోలికి వెళ్లడానికి సాహసించలేదు. 
 
2025 ఖరీఫ్ లో ఫసల్ బీమా కోసం నోటిఫై చేసిన 26 జిల్లాల్లో కొన్ని పంటలను ఎంపిక చేశారు. సీజన్ ముగిసే సమయానికి రైతుల నుంచి 12 లక్షల వరకు దరఖాస్తులందాయి. వాటిలో 4.52 లక్షల మంది రైతులు తమ వాటా ప్రీమియాన్ని చెల్లించి బీమా  పథకంలో చేరారు. వాతావరణ ఆధారిత బీమా కోసం 20 జిల్లాలను నోటిఫై చేయగా 7.30 లక్షల మంది రైతుల నుంచి దరఖాస్తులందాయి. వారిలో 3 లక్షల మంది తమ వాటా ప్రీమియం చెల్లించి 11.17 లక్షల ఎకరాలకు బీమా చేయించుకున్నారు. 
 
2024 ఖరీఫ్ సీజన్ ముగిసి ఏడాదవుతున్నా ఫసల్ బీమా ప్రీమియంలో కేంద్రం తన వాటాగా చెల్లించాల్సిన నిధులివ్వకుండా పెండింగ్ పెట్టింది. రైతులు తమ వాటా కింద రూ.60.19 లక్షలు చెల్లించగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.304 కోట్లు చెల్లించింది. కేంద్రం తన వాటా కింద రూ.304 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.50 కోట్లే ఇచ్చింది. 
 
ఇన్సూరెన్స్ కంపెనీలకు ఫసల్ బీమా కింద రూ.355.95 కోట్లు ప్రీమియం చెల్లించగా, ఇప్పటి వరకు 82,320 మంది రైతులకు రూ.8.53 కోట్లు మాత్రమే పరిహారం సెటిల్ చేశాయి. 2024 ఖరీఫ్ లో వాతావరణ ఆధారిత బీమా కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.739 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించగా ఇప్పటి వరకు రైతులకు ఒక్క రూపాయి పరిహారం రాలేదు.
 
కేంద్రం తన వాటా ప్రీమియం నిధులు ఇవ్వకపోయినా, ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు క్లెయిములు పరిష్కారం చేయకపోయినా టిడిపి కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. నిరుడు బుడమేరు వరదలు, భారీ వర్షాలు, కరువు వచ్చినా రైతులకు బీమా ఆసరా కాలేదు. ఉచిత బీమా ఉన్నప్పుడే పరిస్థితి అంత దారుణంగా ఉంటే, ఉచిత బీమా లేని ఈ ఖరీఫ్ మొంథా, ఇతర విపత్తుల బాధిత రైతులకు బీమా పరిస్థితి మరింత దారుణంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.