7న సామూహికంగా వందేమాతరం ఆలాపన

7న సామూహికంగా వందేమాతరం ఆలాపన

వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో నవంబర్ 7న ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందేమాతరం గేయం ఆలపించాలని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. 

ఆ రోజున పౌరులు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిథులు, పోలీసులు, వైద్యులు, ఉపాధ్యాయులు, దుకాణదారులు, ఇతర వర్గాల ప్రజలంతా పాల్గొనాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. నవంబర్ 7న అన్ని రాష్ట్రాల్లో గవర్నర్, ముఖ్యమంత్రిల నేతృత్వంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలని తెలిపింది. విద్యాలయ్యాల్లో, జిల్లాల్లో, మండలస్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. 

కేంద్ర ఆదేశాలతో నవంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుంది. దీనికోసం రాష్ట్ర నోడల్ అధికారిగా భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ ఆర్. మల్లికార్జునరావును నియామించింది. ఏర్పాట్ల కోసం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్ని రాష్ట్రాల నోడల్ అధికారులతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 

అన్ని రాష్ట్రాల అధికారులతో సమావేశమై నిర్థిష్ట కార్యాచరణ రూపొందించనున్నారు. తదుపరి చర్యలు తీసుకోవాలని నోడల్ ఆఫీసర్కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు విడుదల చేశారు.

బంకిమ్‌చంద్ర 1875, నవంబరు 7న ‘వందేమాతరం’ రాశాడని అంటారు. అప్పటికే అతను బెంగాల్‌లో ఆధునిక సాహితీ సమ్రాట్టుగా సుప్రసిద్ధుడు, వచన రచనలో సిద్ధహస్తుడు. భారతదేశానికి నవలా ప్రక్రియను పరిచయం చేసినవాడిగానూ సుపరిచితుడు. బంకిమ్‌చంద్ర రాసిన ‘దుర్గేశనందిని’, ‘అనుశీలన మిత్ర’ వంటి నవలలు బెంగాల్‌లో కొత్తతరం పాఠకులను ఆకట్టుకుంటున్న సమయం అది.

1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్య్రం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓమ్‌ప్రకాశ్‌ వందేమాతర గీతాన్ని పార్లమెంటులో ఆలపించారు. ఏ వాద్య సంగీతమూ లేకుండా అచ్చమైన గాత్రంతో పాడి వినిపించారు. పాటలోని మాధుర్యం, పదాల్లోని భావతీవ్రత సంగీతం మాటున మిగిలిపోకూడదని అలా పాడించారని చెబుతారు ఆనాటి మహానీయులు. దూరదర్శన్‌లో ప్రతిరోజూ సుప్రభాత గీతంగా వినిపించే వందేమాతరానికి నేపథ్య సంగీతం ఉండదు. దానికి కూడా ఇదే కారణమని అంటారు.

స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది. సామాన్యులనూ సమరయోధులుగా మార్చింది. బెంగాల్‌ సాయుధ పోరాట దళం నుంచి ఉరిశిక్షకి గురైన తొలి యోధుడు కుదిరామ్‌ బోస్‌. బ్రిటిష్‌ మేజిస్ట్రేట్‌ కింగ్స్‌ఫోర్డ్‌ హత్యాయత్నం కేసులో అతను దోషిగా అరెస్టయ్యాడు. 1908, ఆగస్టు 11న ఉరిశిక్ష ఖరారైంది. 

 
ఆ సందర్భంగా న్యాయమూర్తి, ‘నువ్వేమైనా చెప్పదలచుకున్నావా?’ అని అడిగాడు. తల అడ్డంగా ఊపి, ‘వందేమాతరం!’ అంటూ చిరునవ్వుతో ఉరికొయ్య వైపు నడిచాడు కుదిరామ్‌. అప్పుటికి అతని వయసు పద్దెనిమిదేళ్లే! ఆ వీరుడి భౌతికకాయాన్ని తీసుకెళ్తుంటే కోల్‌కతా వీధులు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. అందరి నినాదం వందేమాతరం.
బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ నిర్వహించిన అంతర్జాతీయ పోల్‌లో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో రెండో స్థానం అందుకుంది వందేమాతరం. మొదటి స్థానం ఐర్లాండ్‌ స్వాతంత్య్ర దినోత్సవ గీతానికి దక్కింది.  1906లో పాథేఫోన్స్‌ కంపెనీ వందేమాతర గీతాన్ని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గళంలో గ్రామఫోన్‌ రికార్డుగా తెచ్చింది! ఆ తర్వాతి సంవత్సరమే ఆ కాపీలన్నింటినీ బ్రిటిష్‌ పోలీసులు ధ్వంసం చేసేశారు. దానికి సంబంధించిన ఒరిజినల్‌ ప్రతి చాలారోజులు పారిస్‌లోనే ఉండిపోయింది. 1966లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని మళ్లీ కాపీచేయించి మనదేశానికి తెప్పించారు.