ఏపీలో హిందుజా గ్రూప్ రూ.20 వేల కోట్ల పెట్టుబడులు

ఏపీలో హిందుజా గ్రూప్ రూ.20 వేల కోట్ల పెట్టుబడులు

హిందుజా గ్రూప్ భారత ఛైర్మన్ అశోక్ హిందుజా, యూరప్​లోని హిందుజా గ్రూప్ ఛైర్మన్ ప్రకాశ్ హిందుజా, హిందుజా రెన్యువబుల్స్ ఫౌండర్ శోమ్ హిందుజాలతో లండన్​లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. హిందూజా గ్రూప్​ ఏపీలో దశలవారీగా ఏపీలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయించుకుంది.

విశాఖలో ఉన్న హిందుజా పవర్ ప్లాంట్ సామర్ధ్యాన్ని మరో 1,600 మెగావాట్ల ఉత్పత్తికి పెంచేందుకు ఒప్పందం చేసుకుంది. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్​లను ఏర్పాటు చేసే అంశంపై ఒప్పందం చేసుకుందని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్​వర్క్​ ఏర్పాటు అంశంపై అవగాహనా ఒప్పందం కుదిరింది. 

ఏపీలో గ్రీన్ ట్రాన్స్ పోర్ట్ ఎకో సిస్టంను అభివృద్ధి చేసేలా హిందూజా గ్రూప్ సహకరించనుంది. ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. లండన్​లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్డ్‌తో సీఎం భేటీ అయ్యారు.  లండన్​లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారు సంస్థగా ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ఉంది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని చంద్రబాబు ఆహ్వానించారు.

అమరావతి, విశాఖలలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పని చేసేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు.  క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఏపీలో పని చేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. 160 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ఏపీ లక్ష్యం పెట్టుకుందని తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలు, ఈ రంగంలో ఏపీ నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాల గురించి చర్చించేందుకు రోల్స్ రాయిస్‌ గ్రూప్ చీఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్ నిక్కీ గ్రేడీ స్మిత్‌తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.   అదే విధంగా లండన్​లోని పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. 

విశాఖలో ఈ నెల 14, 15వ తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి నిర్మాణ రంగ సంస్థ ఆరుప్ గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ జేమ్స్ కెన్నీ, డిజిటల్ రిస్క్ మేనేజ్మెంట్ కంపెనీ అల్తెరిన్ టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రెడీ వూలాండ్ తదితరులు హాజరయ్యారు.