సోమవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులకు పుణ్య క్షేత్రాలు, దేవాలయాలలో ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆలయాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసిద్ధ క్షేత్రాలతోపాటు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నిర్వహణలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో దేవాదాయ శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తక్షణమే అందించాలి” అని చెప్పారు.
“అక్కడ కూడా రద్దీ విషయమై పర్యవేక్షణ చేయాలి. ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి ఉన్నందున ఆ రోజు, ఆ తర్వాత రోజు ఉండే రద్దీని అంచనా వేసుకోవాలి. ముఖ్యంగా శని, ఆది, సోమవారాల్లో భక్తుల సంఖ్య భక్తుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి” అని పవన్ కళ్యాణ్ సూచించారు.
“భక్తుల రద్దీకి తగిన విధంగా ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్ల నిర్వహణ ఉండాలి. క్యూ లైన్లపైనా, ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. భక్తుల రద్దీకి తగిన విధంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, చెత్త పేరుకుపోకుండా పారిశుధ్య నిర్వహణను స్థానిక సంస్థల యంత్రాంగం చేపట్టాలి. భక్తుల రద్దీకి తగిన విధంగా ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ బస్సులు నడపాలి” అని వివరించారు.
రద్దీ సమయాల్లో ఆయా క్షేత్రాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను క్రమబద్దీకరిస్తూ ప్రమాదాలకు తావులేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఆలయాల దగ్గర మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

More Stories
74 శాతం భారతీయ విద్యార్థులను తిరస్కరించిన కెనడా
7న సామూహికంగా వందేమాతరం ఆలాపన
ఏపీలో హిందుజా గ్రూప్ రూ.20 వేల కోట్ల పెట్టుబడులు