జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో త్రిముఖ పోరులో వివిధ వర్గాల ఓట్లు చీలి బీజేపీ ‘కింగ్’ అవుతుందని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి భరోసా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఓటమి భయంతోనే గత ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్‌కు ఈసారి టికెట్ ఇవ్వలేదని, అయితే ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా గెలుస్తామన్న ఆశలో ఉందని విమర్శించారు. రెండేళ్లుగా ప్రజల మధ్యకు రాని కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు. ఈ విషయంలో కేటీఆర్ పగటికలలు కంటున్నారని స్పష్టం చేశారు. 
బీఆర్‌ఎస్ ఓటు అడిగే ముందు కేసీఆర్ రెండు గంటల పాటు జూబ్లీ హిల్స్‌లో పాదయాత్ర చేసి, బీఆర్‌ఎస్ హయాంలో అక్కడ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఒక సంస్థ నిర్వహించిన సర్వేపై ఆయన స్పందిస్తూ ఆ సర్వేను బాత్‌రూంలో నిర్వహించారా? బెడ్‌రూంలో నిర్వహించారా? అని మండిపడ్డారు. తామంతా సమష్టిగానే ప్రచారం చేస్తున్నామని, స్థానిక ఎంపీగా, తనకు కూడా పార్టీయే ప్రచార కార్యక్రమాలను నిర్దేశిస్తోందని చెప్పారు. 
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రె్‌సదేనని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లు అమలు చేస్తే అన్ని స్థానాల్లోనూ ఎంఐఎం పోటీ చేయడం ఖాయం. సీఎం రేవంత్‌కు ధైర్యముంటే బీసీలకు కేటాయించిన స్థానాల్లో కూడా ఎంఐఎం పోటీ చేయబోదని ప్రకటించాలి” అని సవాల్ చేశారు. 
బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఢిల్లీలో ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. మజ్లి్‌సను పెంచి పోషించిన బీఆర్‌ఎస్, కాంగ్రె్‌సకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపిచ్చారు. మజ్లిస్ ఆగడాలతో ఎంతో మంది బస్తీలు ఖాళీ చేస్తున్నారని పేర్కొంటూ అలాంటి పరిస్థితి జూబ్లీ హిల్స్‌కు రాకూడదంటే బీజేపీకి ఓటేయాలని కోరారు. మజ్లిస్ నుంచి హైదరాబాద్‌ను రక్షించుకోవాలని చెప్పారు. 
రెండు, మూడు వేలకు ఓట్లు అమ్ముకోవ్దదని, మన పిల్లల భవిష్యత్తు, బస్తీలు, జూబ్లీ హిల్స్‌ను దృష్టిలో పెట్టుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. హామీలను తుంగలో తొక్కిన కాంగ్రె్‌సకు ఓటేస్తే మీ విలువైన ఓటు వృథా అయినట్లేనని స్పష్టం చేశారు. మెట్రోను తాను అడ్డుకుంటున్నట్లు తప్పుడుప్రచారం చేయడం కాంగ్రెస్ మంత్రులకు రివాజుగా మారిందని ఆయన విమర్శించారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో బీజేపీ ఇంప్లీడ్ అయిందని చెప్పారు. 
                            
                        
	                    
More Stories
సెల్, జీన్ థెరపీ రంగంలో భారత్ బయోటెక్
హోమ్ శాఖ కోసం పట్టుబడుతున్న అజారుద్దీన్!
చేవెళ్ల బస్సు ప్రమాదంలో 21 మంది బలి