టాటా ట్రస్ట్స్‌ పై న్యాయపోరాటంకు మెహ్లీ మిస్త్రీ

టాటా ట్రస్ట్స్‌ పై న్యాయపోరాటంకు మెహ్లీ మిస్త్రీ
టాటా గ్రూప్‌ దాతృత్వ సంస్థ టాటా ట్రస్ట్స్‌ లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. దివంగత పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మెహ్లీ మిస్త్రీకి టాటా ట్రస్ట్స్‌ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. టాటా గ్రూప్‌ నకు చెందిన మూడు కీలక దాతృత్వ ట్రస్ట్‌లకు జీవితకాల ట్రస్టీగా మెహ్లీ మిస్త్రీని పునర్నియమించేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించలేదు. టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ నియోల్‌ టాటా, మరో ఇద్దరు ట్రస్టీలు.. మిస్త్రీ పునర్నియామకాన్ని గట్టిగా వ్యతిరేకించారు. 
 
దీంతో మిస్త్రీ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ముంబై ఛారిటీ కమిషనర్‌ వద్ద కేవియట్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. రతన్‌ టాటా అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మెహ్లీ మిస్త్రీ 2022లో టాటా ట్రస్ట్స్‌కు ట్రస్టీగా నియమితులయ్యారు. అయితే, ఆయన మూడేండ్ల పదవీకాలం అక్టోబర్ 28తో ముగిసింది. దీంతో ట్రస్టీగా మెహ్లీ మిస్త్రీ మూడేండ్ల పదవీకాలం ముగుస్తుండటంతో ఆయన పునర్నియామకం చేపట్టారు. ఇందుకోసం అనుమతిని కోరుతూ ఇతర ట్రస్టీలకు టాటా ట్రస్ట్స్‌ సీఈఓ ఇటీవలే ఒక సర్క్యులర్‌ పంపారు.
 
 అయితే, ఈ ప్రతిపాదనను ట్రస్టీలు నోయల్‌ టాటా, టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ చైర్మన్‌ ఎమిరేట్స్‌ వేణు శ్రీనివాసన్‌, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి విజయ్‌ సింగ్‌ వ్యతిరేకించారు. ఇదే సమయంలో సిటిబ్యాంక్‌ ఇండియా మాజీ సీఈవో ప్రమిత్‌ ఝవేరి, ముంబైకి చెందిన న్యాయవాది డారియస్‌ ఖంబాట, పుణెకు చెందిన ఫిలంత్రోఫిస్ట్‌ జహంగీర్‌ హెచ్‌సీ జహంగీర్‌లు మిస్త్రీకి మద్దతు పలికారు. అయినప్పటికీ మిస్త్రీ పునర్నియామకానికి ఆమోదం లభించలేదు.