భారత మహిళల జట్టుకు తొలిసారి వన్డే ప్రపంచకప్‌ కైవసం

భారత మహిళల జట్టుకు తొలిసారి వన్డే ప్రపంచకప్‌ కైవసం
భారత మహిళా క్రికెట్‌లో కొత్త చరిత్ర మొదలయింది. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. తుదిపోరులో దక్షిణాఫ్రికాపై 52 పరుగులతో ఘన విజయం సాధించారు. తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను కైవశం చేసుకున్నారు. ఇప్పటికి రెండు సార్లు ఈ కప్‌లో ఫైనల్‌లో విఫలం చెందినా, మూడోసారి టైటిల్‌ను పట్టేశారు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రికార్డు విజయం సాధించి ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత్‌ ఫైనల్లోనూ అదే జోరు ప్రదర్శించింది. బ్యాట్‌తో, బంతితోనూ రాణించి విశ్వ విజేతలుగా ఆవిర్భవించారు. 

ఆదివారం సుమారు 40వేల మంది అభిమానుల సమక్షంలో నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ఉమెన్‌ ఇన్‌ బ్లూ దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టికరిపించి కొత్త చరిత్ర సృష్టించింది. భారత్‌ నిర్దేశించిన భారీ ఛేదనలో సౌతాఫ్రికా  45.3 ఓవర్లలో 246 పరుగుల వద్దే ఆగిపోయి తొలి కప్పు కలకు దూరమైంది. ఛేదనలో సారథి లారా వోల్వార్డ్‌ (98 బంతుల్లో 101, 11 ఫోర్లు, 1 సిక్స్‌) బ్యాక్‌ టు బ్యాక్‌ శతకంతో కదం తొక్కినా మిగిలిన బ్యాటర్లు విఫలమవడం ఆ జట్టును దెబ్బతీసింది. 

బ్యాట్‌తో మెరిసిన దీప్తి బంతితోనూ (5/39) కీలక వికెట్లు తీసి సఫారీల నడ్డి విరిచింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు సాధించింది. షెఫాలీ వర్మ (78 బంతుల్లో 87, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధికారిక ఇన్నింగ్స్‌కు తోడు దీప్తి (58 బంతుల్లో 58, 3 ఫోర్లు, 1 సిక్స్‌), స్మృతి మంధాన (58 బంతుల్లో 45, 8 ఫోర్లు) రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ షెఫాలీకి దక్కగా టోర్నీలో 215 రన్స్‌, 22 వికెట్లతో సత్తాచాటిన దీప్తి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా ఎంపికైంది.

నాకౌట్‌ దశలో జట్టులోకి వచ్చిన షెఫాలీ కీలక మ్యాచ్‌లో సత్తాచాటింది. దూకుడు, సంయమనం కలగలిపి ఆడిన ఆమె జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వందశాతం నిలబెట్టుకుంది. తొలి వికెట్‌కు స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (58 బంతుల్లో 45, 8 ఫోర్లు)తో కలిసి 104 పరుగులు జోడించి బలమైన పునాది వేసింది. ఖాకా రెండో ఓవర్లోనే ముందుకొచ్చి ఆడిన ఆమె కాప్‌ బౌలింగ్‌లోనూ అదే దూకుడును ప్రదర్శించింది. 

మరో ఎండ్‌లో స్మృతి ఆఫ్‌సైడ్‌ దిశగా తనదైన ట్రేడ్‌మార్క్‌ డ్రైవ్‌లు, లేట్‌కట్‌, స్వీప్‌ షాట్లతో అలరించింది. కానీ పవర్‌ ప్లే తర్వాత స్కోరువేగం క్రమంగా మందగించింది. అర్ధశతకానికి చేరువవుతున్న క్రమంలోట్రయాన్‌ వేసిన 18వ ఓవర్లో నాలుగో బంతి స్మృతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి కీపర్‌ జాఫ్టా చేతుల్లో పడటంతో తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్‌తో షెఫాలీ ఫిఫ్టీ పూర్తయింది. 

స్మృతి స్థానంలో వచ్చిన జెమీమా (24)తో కలిసి షెఫాలీ స్కోరువేగాన్ని పెంచింది. ఇద్దరూ వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తుతూ రన్‌రేట్‌ పడిపోకుండా జాగ్రత్తపడ్డారు. శతకం దిశగా సాగుతున్న షెఫాలీ ఖాకా 28వ ఓవర్లో భారీ షాట్‌ ఆడబోయి మిడాఫ్‌లో లుస్‌ చేతికి చిక్కడం జట్టును దెబ్బతీసింది. షెఫాలీ నిష్క్రమణ తర్వాత భారత బ్యాటింగ్‌ లైనప్‌ తడబడింది. ఖాకా 30వ ఓవర్లో జెమీమాను ఔట్‌ చేయగా భారత్‌ భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (20)ను ఎంలబా బౌల్డ్‌ చేసింది. 

దీప్తి వేగంగా ఆడలేకపోయినా వికెట్ల పతనాన్ని అడ్డుకుని సంయమనాన్ని ప్రదర్శించింది. అమన్‌జ్యోత్‌ (12) వేగంగా ఆడలేక డి క్లెర్క్‌ బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. అయితే ఏడో స్థానంలో వచ్చిన రిచా (24 బంతుల్లో 34, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో భారత్‌ ప్రత్యర్థి ఎదుట పోరాడగలిగే స్కోరును నిర్దేశించగలిగింది.

రికార్డు ఛేదనను సఫారీలూ నిలకడగానే ఆరంభించారు. తొలి వికెట్‌కు హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యం తర్వాత తజ్మిన్‌ బ్రిట్స్‌ (23) సూపర్‌ త్రో తో భారత్‌కు తొలి వికెట్‌ దక్కింది. శ్రీచరణి బోష్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. కానీ మరో ఎండ్‌లో వోల్వార్డ్‌ మరోసారి బాధ్యతాయుతంగా ఆడింది. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించింది. సునె లుస్‌ (25)తో కలిసి మూడో వికెట్‌కు 52 రన్స్‌ జోడించి ఆ జట్టును లక్ష్యం దిశగా నడిపించింది. 

రాధా యాదవ్‌ 17వ ఓవర్లో బౌండరీతో ఆమె అర్ధ శతకం పూర్తయింది. అయితే 21వ ఓవర్లో హర్మన్‌.. షెఫాలీకి బంతినివ్వడంతో ఆమె వరుస ఓవర్లలో లుస్‌, మరిజనె కాప్‌ను పెవిలియన్‌కు పంపింది. జాఫ్టా (16)ను దీప్తి ఔట్‌ చేసి ఒత్తిడి పెంచాలని చూసింది. కానీ అనెరి డెర్క్‌సెన్‌ (35) వేగంగా ఆడింది. రాధా 32వ ఓవర్లో ఆమె రెండు భారీ సిక్సర్లు బాదింది. డెర్క్‌సెన్‌, లారా ద్వయం స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ ఆరో వికెట్‌కు 61 రన్స్‌ జోడించారు.