పోలవరం భూసేకరణలో భాగంగా భూములు ఇచ్చిన నిర్వాసితులకు పరిహారం చెల్లింపునకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాజాగా రూ. 1,000 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో నిర్వాసితుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడం ప్రారంభమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా వేలేరుపాడలో ప్రారంభించి, నిర్వాసితులకు శుభవార్త అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు, గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన రూ. 3,385 కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా కృషి చేస్తోందని, ఆరు నెలల ముందే నిర్వాసితులకు కాలనీలను నిర్మించి అందిస్తామని హామీ ఇచ్చారు.నిర్వాసితుల పరిహారం చెల్లింపులో ఆలస్యం జరగకుండా ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎవరికైనా పరిహారం అందకపోతే టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. 2016లో రూ. 700 కోట్లు, 2025 జనవరిలో రూ. 900 కోట్లు, ఇప్పుడు మరో రూ 1,000 కోట్లు చెల్లించడం ద్వారా మొత్తం పరిహారం పంపిణీ బాధ్యతను సీఎం చంద్రబాబు నెరవేర్చారని పేర్కొన్నారు.
పరిహారం పేరుతో ప్రజలను మోసం చేసే దళారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. అలాంటి వ్యక్తులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

More Stories
మాజీ మంత్రి జోగి రమేశ్‌కు 13 వరకు రిమాండ్
శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో బాహుబలి రాకెట్!