నైతిక, మానవ-కేంద్రీకృత కృత్రిమ మేథస్సు కోసం భారత్

నైతిక, మానవ-కేంద్రీకృత కృత్రిమ మేథస్సు కోసం భారత్
* ప్రైవేట్‌రంగంలో పరిశోధనలకు రూ.లక్ష కోట్లతో నిధి
నైతిక, మానవ-కేంద్రీకృత కృత్రిమ మేథస్సు (ఎఐ) కోసం ప్రపంచ చట్రాన్ని రూపొందించడంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఎమర్జింగ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ కాన్‌క్లేవ్‌ (ఇఎస్‌టిఐసి) 2025ను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ సమాజంలోని ప్రతి వర్గానికి ఎఐ అందుబాటులోకి, ప్రయోజనకరంగా ఉండేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
 
కాగా, నేడు ఎఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజిన్స్‌)ని ఇప్పుడు అంతటా ఉపయోగిస్తున్నారని, రిటైల్‌ నుండి లాజిస్టిక్స్‌ వరకు కస్టమర్‌ సేవ నుండి పిల్లల హోం వర్క్‌ వరకు ఇలా అన్నిచోట్లా ఉపయోగిస్తున్నారని ప్రధాని గుర్తు చేశారు.  అందువల్ల ఎఐని సమాజంలోని ప్రతి వర్గానికి ఉపయోగకరంగా తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఇండియా ఎఐ మిషన్‌ కోసం రూ. పదివేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామని పేర్కొంటూ 2026 ఫిబ్రవరిలో గ్లోబల్‌ ఎఐ సమ్మిట్‌ను భారత్‌ నిర్వహిస్తోందని ప్రధాని వెల్లడించారు. 
 
“అప్పుడు సమ్మిళిత, నైతిక, మానవ కేంద్రీకృత ఎఐ కోసం భారత్‌ కీలక ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు కూడా ఆవిధమైన ప్రయత్నాలను భారత్‌ చేస్తోంది. ఈ విధమైన ప్రయత్నాలు రాబోయే ఎఐ గవర్నర్సెస్‌కు ముందడుగు. ఎఐ ద్వారా రూపొందించే కొత్త కొత్త ఆవిష్కరణలతోపాటు, వాటి భద్రతకు సంబంధించిన వాటిని అభివృద్ధి చేసుకోవడం వంటివి లక్ష్యాలుగా ఉండాలి” అని ఆయన సలహానిచ్చారు.
కాగా, ప్రైవేటు రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా వాతావరణం కల్పించేందుకు రూ.లక్ష కోట్ల నిధిని ఉపయోగించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. భారీ ఉపగ్రహాన్ని అత్యంత బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించినందుకు ఇస్రోను అభినందించారు. నిన్న భారత్‌ శాస్త్ర సాంకేతిక రంగంలో జెండా ఎగుర వేసిందని, శాస్త్రవేత్తలు అత్యంత బరువైన కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించారని ప్రధాని కొనియాడారు. ఈ మిషన్‌, ఇస్రోతో సంబంధం ఉన్న  శాస్త్రవేత్తలందరినీ తాను అభినందించారు. 

ఈ రోజు శాస్త్ర సాంకేతిక ప్రపంచంలో కూడా గొప్పరోజని, 21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు కలిసి కొత్తతరం శాస్త్ర సాంకేతిక రంగాలకు మార్గదర్శకత్వం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ పథకాన్ని ప్రారంభించామని, దానికి రూ.లక్ష కోట్ల నిధిని కేటాయించామని తెలిపారు.

“రూ.లక్ష కోట్లు మోదీ వద్దే ఉంటుందని మీరు అనుకోవచ్చు. అందుకే మీరు చప్పట్లు కొట్టడం లేదు. ఈ లక్ష కోట్లు మీ కోసం (శాస్త్రవేత్తలు). ఇది మీ సామర్థ్యాలను పెంపొందించడానికి. ఇది మీ కోసం కొత్త అవకాశాలను తెరవడానికి. ప్రైవేట్ రంగంలో కూడా పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడమే మా ప్రయత్నం” అని ప్రధాని పేర్కొన్నారు. 

భారతదేశం హై రిస్క్, అధిక ప్రభావ పరిశోధన ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుందని ప్రధాని తెలిపారు. ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను సైన్స్ అండ్ టెక్నాలజీకి శక్తి కేంద్రంగా ఎదగడానికి ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. దేశంలో ఆధునిక ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి తమ ప్రభుత్వం గణనీయమైన సంస్కరణలను చేపట్టిందని ఆయన వివరించారు.

ఒక దశాబ్దంలో పరిశోధన వ్యయం రెట్టింపు అయ్యిందని పేర్కొంటూ తమ  ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ, సముపార్జన విధానంలో గణనీయమైన సంస్కరణలు చేసిందని చెప్పారు. ఇది భారత్‌ ఆవిష్కరణ పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, వృద్ధి-అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించిందని తెలిపారు. 

గత దశాబ్దకాలంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో మహిలలు భాగస్వామ్యం పెరిగిందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. “మనం భారత అంతరిక్షం గురించి మాట్లాడుకునేటప్పుడు భారతీయ మహిళా శాస్త్రవేత్తల గురించి తప్పక ప్రస్తావిస్తాము. పేటెంట్‌ దాఖలులో దశాబ్దం క్రితం ఈ రంగంలో ఏటా మహిళల సంఖ్య వంద కంటే తక్కువగా ఉండేది. ఇప్పుడు అది ఏటా 5,000లకు పైగా చేరుకుంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇంజనీరింగ్‌ మెడిసిన్‌ (ఎస్‌టిఇఎం) విద్యలో మహిళల వాటా దాదాపు 43 శాతంగా ఉంది. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువ” అని ప్రధాని వెల్లడించారు.