పంజాబ్ పోలీసులు వార్తాపత్రికల పంపిణీని అడ్డుకొనే ప్రయత్నం

పంజాబ్ పోలీసులు వార్తాపత్రికల పంపిణీని అడ్డుకొనే ప్రయత్నం
 
* పంజాబ్‌లో అప్రకటిత అత్యవసర పరిస్థితి
పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు వార్తాపత్రికలు పంపినీకోసం తీసుకువెళ్లే వాహనాలను తీవ్రంగా తనిఖీ చేయడం వల్ల అనేక వార్తాపత్రికల పంపిణీ ఆలస్యం అయింది. ఉగ్రవాద రోజుల తర్వాత వార్తాపత్రికల ప్రసరణ దెబ్బతినడం ఇదే మొదటిసారి కావచ్చు. అనేక ప్రాంతాలలో పోలీసు బృందాలు వార్తాపత్రిక వ్యాన్‌లను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయని తెలుస్తోంది. వార్తాపత్రికలను ఎందుకు పంపిణీ చేయలేదని ప్రజలు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. 
 
పాటియాలా ఎంపీ డాక్టర్ ధరంవీర గాంధీ వార్తాపత్రికల పంపిణీపై పోలీసుల చర్యను ఖండిస్తూ ఇది పంజాబ్ ప్రభుత్వం “పంజాబ్‌లో అప్రకటిత అత్యవసర పరిస్థితి” ప్రకటించడానికి చాలా తక్కువగా ఉందని చూపిస్తుందని మండిపడ్డారు. “ఇటువంటి ప్రభుత్వ చర్య అప్రజాస్వామికం, ఎన్నికైన ప్రభుత్వ సూత్రాలకు విరుద్ధం” అని విమర్శించారు.


పంజాబ్‌ ప్రభుత్వం నియంతృత్వం శిఖరాగ్రానికి చేరిందని రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఆరోపించారు. ‘శీష్ మహల్ 2.0’ వివాదం’ నేపథ్యంలో వార్తాపత్రికల పంపిణీని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించినట్లు ఆమె విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
చండీగఢ్‌లోని సెక్టార్ 2లో పంజాబ్‌ సీఎం కోసం ఉద్దేశించిన విలాసవంతమైన ప్రభుత్వ బంగ్లాను కేజ్రీవాల్‌కు కేటాయించినట్లు ఆమె ఆరోపించారు. ఈ బంగ్లాను ‘శీష్ మహల్ 2.0’గా స్వాతి మలివాల్‌ అభివర్ణించారు. ఢిల్లీకి చెందిన ఆప్‌ మాజీ మంత్రులకు కూడా అక్కడ మరికొన్ని ప్రభుత్వ బంగ్లాలను పంజాబ్‌ ప్రభుత్వం కేటాయించిందని, అధికారాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు.

కాగా, ‘శీష్ మహల్ 2.0’పై తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన మీడియా కవరేజీని అడ్డుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు స్వాతి మలివాల్‌ ఆదివారం ఆరోపించారు. ‘షాకింగ్! ఈ ఉదయం అనేక ప్రాంతాలలో వార్తాపత్రికల పంపిణీని నిరోధించడానికి పంజాబ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు సమాచారం. అరవింద్ కేజ్రీవాల్ ‘శీష్ మహల్ 2.0’ గురించిన వార్తలు పంజాబ్ అంతటా దావానలంలా వ్యాపిస్తుండటంతో ఇదంతా జరుగుతోంది’ అని ఎక్స్‌ పోస్ట్‌లో విమర్శించారు.

మరోవైపు తన ఆరోపణలను కవర్ చేసినా లేదా తన పేరును ప్రస్తావించినట్లయితే ప్రభుత్వ ప్రకటనలు ఉపసంహరిస్తామని మీడియా సంస్థలను పంజాబ్‌ ప్రభుత్వం బెదిరిస్తున్నదని స్వాతి మలివాల్‌ ఆరోపించారు. ‘నియంతృత్వం పరాకాష్టకు చేరింది’ అని ఎక్స్‌ పోస్ట్‌లో ఆమె మండిపడ్డారు. వార్తాపత్రికల పంపిణీని పోలీసులు అడ్డుకుంటున్న వీడియో క్లిప్‌ను ఆమె పోస్ట్‌ చేశారు.

అయితే, వార్తాపత్రికల పంపిణీని ఆపేందుకు ఎటువంటి ప్రయత్నం జరగలేదని, వాహనాలు, డ్రైవర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత విడుదల చేశరమని పోలీసులు చెబుతున్నారు. ఈ వాహనాలను మాదకద్రవ్యాలు లేదా ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడానికి ఉపయోగించవచ్చనే సమాచారం ఆధారంగా తనిఖీ చేయడానికి ఈ కసరత్తు నిర్వహించినట్లు స్పెషల్ డీజీపీ అర్పిత్ శుక్లా తెలిపారు. “వార్తాపత్రికల ప్రసరణను ఆపడానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. వాహనాలు, డ్రైవర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత విడుదల చేశారు. మిగిలినవి ప్రక్రియలో ఉంటాయి” అని చెప్పారు.

జలంధర్ కాంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్ పంజాబ్‌లో పత్రికా స్వేచ్ఛపై ఇది ప్రత్యక్ష దాడి అంటూ ఎక్స్ లో రాశారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ అధికారిక హౌస్ నంబర్ 50 లో బస చేశారనే వార్తలు ప్రజలకు చేరకుండా నిరోధించడానికి భగవంత్ మాన్ ప్రభుత్వం దాడులు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా వార్తాపత్రికల పంపిణీని నిరోధించిందని ఆయన పేర్కొన్నారు.