ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, పాత సమస్యలను పరిష్కరించుకునేలోపే కొత్తవి వస్తున్నాయని ఆర్మీ చీఫ్ తెలిపారు. ప్రపంచ దేశాల మధ్య ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ ఏం చేస్తున్నారు? రేపు ఏం చేయబోతున్నారు? అనే విషయం ఆయనకే తెలియకపోవచ్చునని వ్యాఖ్యానించారు.
మధ్యప్రదేశ్‌లో ఓ కార్యక్రమానికి ద్వివేది హాజరవుతూ గతంలో వ్యతిరేక భావజాలం, భూభాగాల స్వాధీనం కోసం చేసే యుద్ధాలు అందరి కళ్లకు కనిపించేవని, ప్రస్తుతం కొత్త వ్యూహాలతో దేశాలు పరస్పరం యుద్ధ వాతావరణాన్ని సృష్టించుకుంటున్నాయని చెప్పారు. ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ దాడులు, తప్పుడు ప్రచారాల వంటి సవాళ్లను మన సైన్యం ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో తాము కేవలం పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, అయితే ఆ దేశ పౌరులపైనా దాడులకు పాల్పడినట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అయ్యాయని ద్వివేది తెలిపారు. ఇలాంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కోవాలంటే సైన్యం ఆయుధపరంగానే కాకుండా టెక్నాలజీ పరంగానూ మరింత ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సింధూర్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఆధునిక ఘర్షణలను ఎదుర్కోవడానికి భారత్ సమాయత్తమవుతుందని ద్వివేది తెలిపారు. ఇందుకోసం త్రివిధ దళాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధాలను ఆపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ గొప్పలు చెప్పుకోవడం, ప్రపంచ దేశాలపై ఇష్టానుసారం సుంకాలు విధించడం వంటి చర్యల నేపథ్యంలో ద్వివేది ఈ వ్యాఖ్యలు చేశారు.

More Stories
తేజస్వీ సీఎం అయితే కిడ్నాపింగ్, వసూళ్లు, హత్య మంత్రిత్వ శాఖలు
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు
కుటుంభం కోసం కాదు.. ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేశా!