తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పండుగ వాతావరణం తరహాలో ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జేఈవో వీ. వీరబ్రహ్మం అధికారులకు సూచించారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టిటిడి ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని ముందస్తుగా అంచనావేసుకుని అందుకుతగ్గట్లు వారం రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు.
శాఖల వారీగా అనుమతులు పెండింగ్ లో ఉంటే వెంటనే అప్రోవల్ తీసుకుని పనులను వేగవంతం చేయాలని, అమ్మవారి గరుడ వాహన సేవ, గజ వాహన సేవ, పంచమి తీర్థం రోజున భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని, భక్తుల రద్దీకి తగ్గట్లు అన్నప్రసాదాలు, క్యూ లైన్లు, సెక్యూరిటీ, పద్మసరోవరంకు ప్రవేశం, నిష్క్రమణ, మెడికల్, పారిశుద్ధ్యం పనులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
తిరుమలలో విద్యుద్దీపాలంకారాలు, ఫలపుష్ప ప్రదర్శన ఏవిధముగానైతే భక్తులను ఆకట్టుకున్నాయో అదేరీతిలో తిరుచానూరులో ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ , గార్డెన్ విభాగాధికారులను ఆదేశించారు. తిరుపతి, తిరుచానూరు పరిసర ప్రాంతాలు పారిశుభ్రంగా ఉండేలా పంచాయతీ అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.
నవంబర్ 16 అంకురార్పణ నుండి పంచమి తీర్థం వరకు అధికారులు రాజీపడకుండా ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు, రంగోళీలు, పిఏ సిస్టమ్, ఎల్ఇడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాబృందాల ప్రదర్శనలు ఉండాలని తెలిపారు.
భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదాలు అందించేలా నవజీవన్, తోళప్ప గార్డెన్స్, పూడీ, హైస్కూల్ ప్రాంతాలలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పంచమి తీర్థం రోజున అలిపిరి నుండి తిరుచానూరు వరకు పడి ఊరేగింపులో భక్తులకు ముందస్తుగా సమాచారం తెలిసేలా ప్రకటనలు ఇవ్వాలని, భక్తులకు తాగునీరు, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య సేవలు తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అదేవిధంగా, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. బ్రహ్మోత్సవాలకు అవసరమైన శ్రీవారి సేవకులను సమీకరించుకోవాలని సూచించారు. ఎస్వీబీసీ ద్వారా బ్రహ్మోత్సవాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలను అందించాలని చెప్పారు. శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన జేఈవో అధికారులకు పలు సూచనలు చేశారు.

More Stories
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
పరకామణి కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు