తేజస్వీ సీఎం అయితే కిడ్నాపింగ్, వసూళ్లు, హత్య మంత్రిత్వ శాఖలు

తేజస్వీ సీఎం అయితే కిడ్నాపింగ్, వసూళ్లు, హత్య మంత్రిత్వ శాఖలు
తేజస్వి యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రంలో మూడు కొత్త శాఖలు ఏర్పాటు చేస్తారని, అందులో ఒకటి కిడ్నాపింగ్, రెండోది వసూళ్లు, మూడోది హత్యల మంత్రిత్వ శాఖ అని  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ పాలనలో బిహార్‌లో ‘జంగిల్ రాజ్’ మళ్లీ వస్తుందని ఆయన హెచ్చరించారు.

లాలు-రబ్రీదేవి 15ఏళ్ల పాలనలో బిహార్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. బిహార్‌ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తే జంగల్‌రాజ్‌ను ఎవరు తిరిగి తేలేరని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముజఫర్‌పుర్‌ సభలో పాల్గొన్న అమిత్‌షా ఆర్జేడీ లక్ష్యంగా తీవ్ర విమర్శులు చేశారు. 

బిహార్‌ను జంగల్‌రాజ్‌ నుంచి కాపాడేందుకు ఎన్డీయేను గెలిపించాలని  ఆయన కోరారు. నితీష్-మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే రాష్ట్రంలో అభివృద్ధి, భద్రతకు పెద్దపీట వేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ‘నితీష్-మోదీ కూటమి అధికారంలోకి వస్తే, వరదలు లేని బిహార్ కోసం ఒక కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటవుతుంది. మా ప్రభుత్వం బిహార్‌ను సురక్షితంగా, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మార్చడానికి, దశాబ్దాలుగా ఉన్న సమస్యల నుంచి విముక్తి కల్పించడానికి కట్టుబడి ఉంది’ అని అమిత్ షా ప్రకటించారు.

“లాలు-రబ్రీదేవి హయాంలో గోపాల్‌గంజ్‌ డీఎం కృష్ణయ్య హత్య జరిగింది. మళ్లీ లాలూ కుమారుడు సీఎం అయితే బిహార్‌లో 3 కొత్త మంత్రిత్వ శాఖలు ఏర్పాటవుతాయి. ఒకటి వసూళ్లు, కిడ్నాపింగ్, మర్డర్ శాఖలు ఏర్పాటవుతాయ్. మీరు(ప్రజలు) మోదీ-నీతీశ్‌ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బిహార్‌ను వరదల నుంచి విముక్తి కల్పించే శాఖ ఏర్పాటవుతుంది.”  అని తెలిపారు.

లాలూ యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇద్దరూ తమ తమ వారసులను పదవుల్లో చూడాలని ఆశిస్తున్నారని అమిత్ షా విమర్శించారు. ‘లాలూ యాదవ్ తన కొడుకును బిహార్ ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు. సోనియా గాంధీ తన కొడుకును ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నారు. కానీ, ఈ రెండు పదవులు ఖాళీగా లేవు. బిహార్ ప్రజలు మరోసారి స్థిరత్వం, అభివృద్ధి కోసం నితీష్-మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తారు’ అని షా స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ భారత దేశాన్ని సురక్షితంగా, సంపన్నంగా మార్చేందుకు వివిధ సంక్షేమ పథకాలను ప్రారంభించారని అమిత్ షా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ సర్కారు ప్రారంభించిన సంక్షేమ పథకాలను షా హైలైట్ చేసారు. జీఎస్టీ తగ్గింపు బిహార్‌లోని లిచీ రైతులకు ఉపయోగపడుతుందని చెప్పారు.  ముజఫర్‌పూర్‌లో రూ. 20,000 కోట్ల పెట్టుబడితో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు షా వివరించారు. మోదీ-నితీష్ పాలనలో రైలు ఇంజిన్‌ల ఎగుమతి, గయాజీలో ఇంజనీరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా బిహార్ అవతరించిందని షా చెప్పారు.