నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
 
ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను వియవాడ సిట్ కార్యాలయానికి తరలించనున్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. తానేం నేరం చేయలేదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తనను అరెస్టు చేసి రాక్షస ఆనందం పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ తొక్కిసలాట జరిగితే స్పందించలేదని పేర్కొంటూ 10 రోజులుగా తన ప్రమేయం లేదని చెబుతున్నా అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
 
కాగా, ఆదివారం ఉదయం సిట్ బృందం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు వెళ్లింది. తీవ్ర ఉద్రిక్త పరిణామాల తర్వాత ఎక్సైజ్ పోలీసులు జోగి రమేశ్‌తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్‌ చేశారు. నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్ధనరావు ఇచ్చిన వాంగ్మూలం మేరకు జోగి రమేష్‌ని అరెస్ట్ చేశారు.  అరెస్ట్‌కు ముందు జోగి రమేశ్ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. 
 
ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు జోగి రమేష్ ఇంటికి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు తరలి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు వచ్చారని తెలుసుకున్న జోగి రమేష్ సుమారు 3 గంటల పాటు డోర్ తీయకపోవడంతో అధికారులు ఇంటి బయటనే ఉన్నారు. అనంతరం ఉదయం 8 గంటల సమయంలో ఆయన డోర్ ఒపెన్ చేయడంతో ముందుగా పోలీసులు ఆయనకు నోటీసులు అందజేసి ఆ తర్వాత అరెస్ట్ చేశారు.
 
ఈ కేసులో ఏ1 నిందితుడు జనార్దనరావు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. జోగి రమేశ్‌ ప్రోద్బలం మేరకే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. జోగి రమేష్ తనకు రూ.3 కోట్లు సాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే నకిలీ మద్యం తయారు చేశానని పోలీసులకు తెలిపారు.

జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలోనే, అనగా 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామని జనార్దనరావు తెలిపారని సమాచారం. ఈ మేరకు రాతపూర్వకంగా స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే తాను ఆఫ్రికా వెళ్లే ముందు అనగా అక్టోబర్ 23న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్‌ నివాసానికి వెళ్లినట్లు జనార్దనరావు పోలీసులకు తెలిపారు. దీంతో సిట్ బృందం దీనికి సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలను సేకరించింది.