ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చండి

ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చండి

* అమిత్ షాకు బీజేపీ ఎంపీ ఖండేల్వాల్ లేఖ

దేశ రాజధాని ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ డిమాండ్‌ చేశారు. అలాగే పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను ‘ఇంద్రప్రస్థ జంక్షన్’గా, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ‘ఇంద్రప్రస్థ విమానాశ్రయం’గా మార్చాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు శనివారం లేఖ రాశారు.  ఢిల్లీ చరిత్ర వేల సంవత్సరాల నాటిది మాత్రమే కాదని, భారతీయ నాగరికత, ఆత్మతోపాటు పాండవులు స్థాపించిన శక్తివంతమైన ‘ఇంద్రప్రస్థ’ నగరం సంప్రదాయాన్ని కూడా ప్రతిబింబిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. 
ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థం’గా మార్చడం వల్ల చరిత్ర, సంస్కృతి, విశ్వాసం పునరుజ్జీవితమవుతుందని ఆయన తెలిపారు.  కాగా, దేశంలోని ఇతర చారిత్రక నగరాలైన ప్రయాగ్‌రాజ్, అయోధ్య, ఉజ్జయిని, వారణాసి వంటివి వాటి పురాతన గుర్తింపులతో తిరిగి కనెక్ట్ అవుతున్నాయని ఢిల్లీ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ గుర్తు చేశారు. అదే మాదిరిగా ఢిల్లీని కూడా పురాతన మూలాలతో అనుసంధానం చేయాలని ఆయన కోరారు. ‘

“ఢిల్లీ కేవలం ఆధునిక మహానగరం మాత్రమే కాదు. భారతీయ నాగరికత, ఆత్మ. ఢిల్లీని దాని అసలు రూపంలో గౌరవించాలి. పేరు మార్పు చారిత్రక న్యాయం మాత్రమే కాదు. సాంస్కృతిక పునరుజ్జీవనం వైపు ఒక ముఖ్యమైన అడుగు కూడా. ఇది చరిత్రను పునరుద్ధరిస్తుంది. చారిత్రక న్యాయం, సాంస్కృతిక గౌరవాన్ని సూచిస్తుంది” అని ఆ లేఖలో  ఖండేల్వాల్ వివరించారు.

మరోవైపు ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చడం వల్ల భారత రాజధాని అధికార కేంద్రమే కాదని మతం, నీతి, జాతీయవాదానికి చిహ్నం అనే సందేశాన్ని భవిష్యత్ తరాలకు పంపుతుందని బీజేపీ ఎంపీ తెలిపారు. అలాగే పాండవుల గొప్ప విగ్రహాలను దేశ రాజధానిలో ఏర్పాటు చేయాలని కోరారు. పాండవుల నీతి, ధర్మం, ధైర్యానికి చిహ్నంగా కొత్త తరానికి ఇవి గుర్తు చేస్తాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతోపాటు ఇతర మంత్రులకు కూడా ఆ లేఖ ప్రతులను ఆయన పంపారు.