2024లో తెలంగాణ నుండి భాజపా లోకసభకు 8 స్థానాలు గెలవటం వెనుక దుబ్బాక, హుజూరాబాద్, ఉపాధ్యాయ ప్రతినిధుల ఎన్నిక ప్రభావం ఉంది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాజపా 8 స్థానాలకే పరిమితం కావటం వెనుక మునుగోడు, పట్టభద్ర నియోజకవర్గంలలో ఓటమి ప్రభావం ఉంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్నం శ్రీనివాసరెడ్డి, డా. గడ్డం వివేక్ గారి గురించి నేనేమీ వ్యాఖ్యానించాలని అనుకోవటం లేదు. రొట్టెకు ఎటువైపు వెన్న రాసి ఉందో వెతుక్కొంటూ పోవటం వారి స్వభావం. శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తి పార్టీ మారటం కోసం శాసన సభ్యత్వానికి రాజీనామా చేయటం, అప్పుడు జరిగిన ఉపఎన్నికలో భాజపా అభ్యర్థిగా గెలుపొందలేకపోవటం అప్పటివరకు పొంగుమీద ఉన్న ఉత్సాహంపై నీరుచల్లింది.
భాజపా గెలుచుకొనడానికి అవకాశమున్న హైదరాబాద్ మహబూబ్ నగర్, పట్టభద్రుల నియోజకవర్గంలో అప్పటి వరకు శాసన మండలి సభ్యునిగా ఉన్న భాజపా అభ్యర్థి తన స్థానాన్ని కోల్పోవడము, వరంగల్, నల్గొండ స్థానంలో గెలుపొందలేక పోవటమూ, ఆపైన మునుగోడు పరాభవమూ -ఈ మూడు అంశాలు 2023 శాసనసభ ఎన్నికలపై ఊహాతీతమైన ప్రభావాన్ని చూపించాయి.
చిరకాలంగా పార్టీని అంటి పెట్టుకున్న వారందరూ పార్టీని అంటిపెట్టుకొని ఉంటున్నారు. ఎవరూ పోలేదని ఆ పార్టీ నాయకులు గాంభీర్యాన్ని ప్రకటిస్తూ ఉండవచ్చు గాక. కాని భాజపా అధికారంలోకి రాబోతున్నదనే ఆశతో సన్నిహితులైనవారు మరో తీరున నిర్ధారణకు వచ్చారు. దుబ్బాక హుజూరాబాద్ ఉపఎన్నికల ఫలితాలనుచూసి ఇకముందు నడిచే తీరుకు ఊహించుకొని, భవిష్యత్తు అంతా భాజపాదేనని ఆశ పెట్టుకొని వచ్చినవారు ఈ ఫలితాలతో హతాశులైనారు.
భాజపా నాయకులు కార్యకర్తలు పోరాటానికి వెరిచేవారు కాదన్న మాట సందేహాతీతమే అయినా, గెలిచే తీరులో, గెలిచే వరకూ పోరాడటం వారికి తెలియదని నిర్ధారణకు వచ్చారు. భాజపావారు గెలుపు ఓటములు సమానంగా పరిగణించి సర్దుకుపోతుంటారని, వారితో కలిసి నడిస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని వారు గ్రహించారు. కాబట్టి గెలిచి తీరాలనే పట్టుదలతో,(ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా, వాటివల్ల సంప్రాప్తించే నష్టం పెద్దగా లెక్కలోకి రాదని భావించుకొని) పనిచేసే పార్టీగా భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి గార్ల పంచన చేరారు.
ఇలా బిజేపికి సంభవించిన పార్శ్వ భంగం ఎటుపోవాలో ఇంకా నిర్ణయించుకోని బిఆర్ఎస్ వ్యతిరేకులైనవారిపై గట్టి ప్రభావాన్ని చూపించింది. అది శాసన సభ ఎన్నికలు ఫలితాలను నిర్దేశించింది. సాలు దొరా, ఇంకా సెలవు దొరా అంటూ నిర్మించుకొంటూ వచ్చిన వాతావరణాన్ని కాంగ్రెసు వారు నగదు చేసుకున్నారు. ఈ కొద్ది నేపధ్యాన్ని గుర్తు పెట్టుకొని ఆలోచిస్తే భాజపా అభిమానులు, సానుభూతి పరులు, కార్యకర్తలు తమ కర్తవ్యం ఏమిటో గ్రహించగలరు.

More Stories
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు
మతమార్పిడులు, ఫాస్టర్లను అడ్డుకోవడం `రాజ్యాంగ వ్యతిరేకం కాదు’
కుటుంభం కోసం కాదు.. ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేశా!