భారత్‌, అమెరికాల మధ్య 10 ఏళ్ల రక్షణ ఒప్పందం

భారత్‌, అమెరికాల మధ్య 10 ఏళ్ల రక్షణ ఒప్పందం

భారత్‌, అమెరికాల మధ్య 10ఏళ్ల రక్షణ ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలకు ఇది ఒక సంకేతంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం పేర్కొన్నారు. మలేషియాలో ఆసియాన్‌ రక్షణ మంత్రుల సమావేశం జరుగుతున్న సందర్భంగా కౌలాలంపూర్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్‌ హెగ్సెత్‌లు భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా ఇరువురు నేతలు రక్షణ ఒప్పందంపై సంతకం చేశారు. 10 ఏళ్ల అమెరికా -భారత్‌ ప్రధాన రక్షణ భాగస్వామ్యం కోసం ముసాయిదాపై సంతకం చేశామని, ఇది ఇప్పటికే బలమైన తమ రక్షణ భాగస్వామ్యంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని సమావేశం అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.  ఈ ఒప్పందం భారత్‌-అమెరికా రక్షణ సంబంధాలన్నింటిలోనూ విధాన దిశానిర్దేశం చేస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు.

ద్వైపాక్షిక సంబంధాల్లో రక్షణ మూలస్తంభంగా ఉందని, స్వేచ్ఛాయుతమైన, బహిరంగమైన, నిబంధనల ఆధారిత ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని నిర్థారించడంలో తమ భాగస్వామ్యం చాలా కీలకమని ఆయన తెలిపారు. 

ఈ ఒప్పందం రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళుతుందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్‌ హెగ్సెత్‌ పేర్కొన్నారు. ప్రాంతీయ స్థిరత్వం, నిరోధానికి ఒక మూలస్తంభం అని చెప్పారు. సమన్వయం, సమాచార భాగస్వామ్యం, సాంకేతిక సహకారాన్ని పెంచుకుంటున్నామని చెబుతూ ఇరు దేశాల మధ్య  రక్షణ సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని వెల్లడించారు.

భారత్‌తో తమకున్న భాగస్వామ్యం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనదని, తమ వ్యూహాత్మక అనుసంధానం ఉమ్మడి ప్రయోజనాలు, పరస్పర విశ్వాసం, సురక్షితమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్‌కు నిబద్ధతపై ఆధారపడి ఉందని తెలిపేరు. ఈ 10 ఏళ్ల ఫ్రేమ్‌వర్క్ అనేది ఒక ప్రతిష్టాత్మక లక్ష్యంతో కూడిన ఒప్పందమని, సైనిక సహకారం, సమాచార భాగస్వామ్యం, సాంకేతిక సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఒక రోడ్‌మ్యాప్‌ను అందిస్తుందని ఆయన వివరించారు. 
ఈ భేటీలో రక్షణ సహకారం, ప్రాంతీయ భద్రతతో పాటు కొన్ని కీలక అంశాలపై కూడా చర్చలు జరిగాయి. గతంలో సుంకాల వివాదం కారణంగా రద్దయిన ద్వైపాక్షిక భేటీ అనంతరం ఈ సమావేశం జరగడం గమనార్హం. ఇరు దేశాలు తమ సమన్వయాన్ని, గూఢచార సమాచార మార్పిడిని, సాంకేతిక సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించాయి. రక్షణ సాంకేతికత బదిలీ ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి భారీగా ఊతమిస్తుంది. సంయుక్త సైనిక విన్యాసాలు, గూఢచార సమాచార భాగస్వామ్యం దేశ భద్రతను బలోపేతం చేస్తాయి.