రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై ద‌ర్యాప్తు

రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై ద‌ర్యాప్తు
శిరోమ‌ణి అకాళీ దళ్ మాజీ మంత్రి బిక్ర‌మ్ సింగ్ మ‌జీతియాపై ఆ రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో విచార‌ణ చేపట్టిన రూ 700 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల కేసులో ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ గులాబ్ చాంద్ క‌టారియా శ‌నివారం అనుమ‌తి ఇచ్చారు. అవినీతి నిరోధ‌క చ‌ట్టంలోని సెక్ష‌న్ 19 ప్ర‌కారం ఆయ‌న త‌న ఆమోదం తెలిపారు. 
సెప్టెంబ‌ర్ 8వ తేదీన పంజాబ్ క్యాబినెట్ చేసిన ప్ర‌తిపాద‌న ఆధారంగా గ‌వ‌ర్న‌ర్ ఆ ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. 
మాజీ మంత్రి మ‌జీతియా వ‌ద్ద సుమారు రూ. 700 కోట్ల విలువైన అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు సుమారు 1200 శాతం అధికంగా ఉన్న‌ట్లు గుర్తించారు. 2013లో డ్ర‌గ్ ట్రాఫికింగ్ నెట్వ‌ర్క్ ద్వారా సుమారు రూ. 540 కోట్లు ఆయ‌న మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు కేసు బుక్కైంది.

మ‌జీతియా నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌జీతియా మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. జూన్ 25వ తేదీ ఆయ‌న్ను అమృత్‌స‌ర్‌లో అరెస్టు చేశారు. అత‌ని ఇంటి నుంచి డిజిట‌ల్ డివైస్‌లు, ప్రాప‌ర్టీ డాక్యుమెంట్లు, ఫైనాన్షియ‌ల్ రికార్డుల‌ను విజిలెన్స్ బ్యూరో సీజ్ చేసింది. మొహాలీ కోర్టు ఆయ‌న‌కు ఏడు రోజుల పోలీసు క‌స్ట‌డీ విధించింది. ఆ త‌ర్వాత జూలై 6న జుడిషియ‌ల్ క‌స్ట‌డీలోకి తీసుకెళ్లారు. 

ఆగ‌స్టు 22వ తేదీన విజిలెన్స్ బ్యూరో పూర్తి వివ‌రాల‌తో అభియోగాలు న‌మోదు చేసింది. సుమారు 200 మంది సాక్ష్యుల నుంచి 40 వేల పేజీల ఆధారాల‌ను సేక‌రించింది. 2013లో పంజాబ్‌లో సుమారు రూ. 6 వేల కోట్ల సింథ‌టిక్ డ్ర‌గ్ రాకెట్ చోటుచేసుకున్న‌ది. మాజీ డీఎస్పీ జ‌గ‌దీశ్ సింగ్ బోలాను ఈ కేసులో విచారించారు. 

డ్ర‌గ్ కేసుతో మ‌జీతియాకు లింకు ఉన్న‌ట్లు జ‌గ‌దీశ్ విచార‌ణ‌లో వెల్ల‌డించారు. అయితే డ్ర‌గ్స్ క‌లిగి ఉన్న కేసుల‌ను గ‌తంలో కోర్టు కొట్టివేసింది. కానీ మ‌నీల్యాండ‌రింగ్ కేసులో మాత్రం విచార‌ణ కొన‌సాగుతున్న‌ది. ఆగ‌స్టులో ఆయ‌న‌కు బెయిల్ నిరాక‌రించారు. సెప్టెంబ‌ర్‌లో పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టులో ఆయ‌న‌కు తాత్కాలిక బెయిల్ దొరికింది. మొహాలీ సెష‌న్స్ కోర్టులో ఈ కేసు విచార‌ణ జ‌ర‌గాల్సి ఉన్న‌ది.