క్రికెట్‌లోనే కాదు రాజకీయాల్లోనూ ఫిక్సరే

క్రికెట్‌లోనే కాదు రాజకీయాల్లోనూ ఫిక్సరే
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ క్రికెట్‌లోనే కాదు రాజకీయాల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఫిక్సరేనని బజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అండదండలతో, ఆశీస్సులతో మంత్రి పదవి దక్కిందని స్పష్టం చేశారు. 
 
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ మస్లింల ఓట్ల కోసం ఉన్నఫళంగా అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చిందని ఆయన విమర్శించారు.

అజహరుద్దీన్‌ను భారత దేశ క్రికెట్ కెప్టెన్‌గా చేస్తే, ఆయన దేశం కోసం కాకుండా డబ్బుల కోసం కక్కుర్తితో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. దీంతో రెండు వేల సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో బిసిసిఐ జీవితకాలం నిషేధం విధించిందని ఆయన గుర్తు చేశారు. 
 
కాంగ్రెస్‌కు మైనారిటీ ఓట్లు మాత్రమే కావాలి కానీ వారి బాగోగులు పట్టించుకోదని ఆయన తూర్పరబట్టారు. మైనారిటీల పట్ల చిత్తశుద్ధి ఉంటే రెండేళ్ళుగా మంత్రివర్గంలోకి మైనారిటీ నాయకునికి ప్రాతినిథ్యం ఎందుకు కల్పించ లేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను మజ్లీస్ పార్టీకి రాసి ఇచ్చేస్తారేమోనన అనుమానాన్ని మహేశ్వర్ రెడ్డి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు, మజ్లీస్ ఆగడాలకు వ్యతిరేకంగా బిజెపికి ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు.