ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఎం రాష్ట్ర నాయకుడు, ఉమ్మడి ఏపీ రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచి సామినేని రామారావు (73) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్ నుంచి తిరిగొచ్చిన ఆయన, తన ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డులో ఉన్న కోళ్లను బయటకు వదిలేందుకు వెళ్లారు.
ఆ సమయంలో అక్కడే మాటు వేసిన దుండగులు ఒక్కసారిగా ఆయనపై కత్తులతో దాడి చేసినట్లు ఘటనా స్థలంలో ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. దాడి సమయంలో రామారావు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వెళ్లి చూడగా, అప్పటికే రక్తపు మడుగులో కనిపించారు. ఘటనా స్థలాన్ని ఖమ్మం సీపీ సునీల్‌దత్ పరిశీలించగా డాగ్‌స్క్వాడ్ ఊరి చివర ఉన్న పల్లె ప్రకృతివనం వరకూ వెళ్లి ఆగింది.
అయితే ఈ హత్య రాజకీయంగా జరిగిందా? ఇంకా ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా? అని పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తన భర్త రామారావు హత్యలో గ్రామానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉందని అనుమానిస్తూ రామారావు భార్య స్వరాజ్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ దాడికి పాల్పడ్డ ఓ దుండగుడు సమీప డాబాపై గురువారం రాత్రి మాటు వేసి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డాబాపై నిందితుడి చెప్పుల జత కూడా ఉంది. హత్య జరిగిన స్థలంలో వారి మధ్య పెనుగులాట జరిగినట్లు ఆధారాలున్నాయి. హత్య అనంతరం నిందితుడు సమీపంలో ఉన్న పెరటిదొడ్డి నుంచి బీసీ కాలనీ మీదుగా పరారైనట్లు తెలుస్తోంది.
ఆ ఘటనా స్థలంలో కత్తి పెట్టే సంచి లభించింది. ఆ పెనుగులాటలో నిందితుడి టీషర్ట్ ముక్క రామారావు చేతిలో ఉంది. నిందితులు సుపారీ గ్యాంగ్ అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒక్కరు హత్య చేశారా? అంతకు మించి ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్నది సంశయంగా మారింది. అయితే హత్యకు ముందు గ్రామ సమీపంలోని పల్లెప్రకృతి వనంలో ఉన్నట్లు తెలుస్తోంది.
సామినేని మృతదేహాన్ని ఖమ్మం సర్వజనాసుపత్రిలో శవపరీక్ష అనంతరం పార్టీ కార్యాలయంలో కొద్దిసేపు ఉంచారు. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీలు పార్టీ జెండాను భౌతికకాయంపై ఉంచి నివాళి అర్పించారు. మృతదేహాన్ని పాతర్లపాడు తీసుకొచ్చారు.

More Stories
రిజర్వేషన్ జీవోకు మళ్లీ న్యాయ చిక్కులు తప్పవా?
తెలంగాణలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు
రాష్ట్రపతి నిలయంలో ‘పశ్చిమ్ కి పరంపర’