తాము కష్టపడి చెమట చిందించి, త్యాగాలు చేసి పార్టీని నిలబెడితే సీల్డ్ కవర్ నేతలకు అత్తరు, పన్నీర్లు పూస్తున్నారని అంటూ మండిపడుతున్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తేనే పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఉంటే ఆయనతోనే ప్రచారం చేయించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలకు నేరుగా తేల్చి చెప్పడంతో వారు ఖంగుతింటున్నారు.
అయితే, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, అది అధిష్ఠానం నిర్ణయమని వారికి ముఖ్యమంత్రి నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నా వారు వినడం లేదు. డిసెంబర్‌లో మరోమారు మంత్రివర్గ విస్తరణ ఉం టుందని, అప్పుడు మీకు అవకాశం వస్తుందని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా, ఇంకా ఎంతకాలం ఈ ఊరడింపులని దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.
మరోవైపు, మైనార్టీ నాయకుడు షబ్బీర్ అలీ, సీనియర్ కాంగ్రెస్ నేత అంజన్‌కుమార్ యాదవ్ సహితం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానంటేనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, తీరా ఇప్పుడు పార్టీ ఫిరాయించినట్టు సుప్రీంకోర్టుకు ఆధారాలు కూడా ఇచ్చారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌పై దానం ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
జూబ్లీహిల్స్ టికెట్ తనకు ఇవ్వకుండా మొదటి తప్పు చేశారని, ఇప్పుడు తనను కాదని అజార్‌కు మంత్రి పదవి ఇచ్చి రెండో తప్పు చేశారని మండిపడినట్టు తెలిసింది. నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం అని తెలిసినప్పటి నుంచే దానం రాజకీయంగా పావులు కదుపుతూ వస్తున్నారు. ఇటీవల గుల్బర్గా వెళ్లి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జునఖర్గేను కలిసి జూబ్లీహిల్స్ టికెట్‌ను అభ్యర్థించారు.
కానీ, పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. ఫిరాయింపు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో స్టార్ క్యాంపెయినర్‌గా తనను నియమించడం తనను అనర్హుడిని చేసే కుట్రేనని దానం అంతర్మథనంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. తనను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ గెలుపు కోసం తాను ప్రచారం చేయలేనని తన సన్నిహితుల వద్ద బాధపడ్డట్టు తెలిసింది.
మైనార్టీ కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ తీవ్ర మనో వేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను నిలబడి అధికారంలోకి తీసుకు వచ్చానని, పార్టీ కోసం కామారెడ్డి సీటును త్యాగం చేశానని షబ్బీర్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మైనార్టీల ప్రతినిధిగా మంత్రి పదవికి తానే అర్హుడినని తెగేసి చెప్పినట్టు తెలిసింది. తనకు జరిగిన అన్యాయంపై ఢిల్లీలోనే తేల్చుకుంటానని మూడు రోజుల క్రితం ఢిల్లీకి పయనమైన ఆయనను ముఖ్యనేత ఆపినట్టు తెలిసింది. ఢిల్లీలోని ఒక కీలక నేతతో ఆయనకు ఫోన్ చేయించినట్టు ప్రచారం జరుగుతున్నది.

More Stories
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
400 కిలోల బంగారంతో సహా రూ 400 కోట్ల మావోయిస్టుల నిధులు!
కేజ్రీవాల్ కోసం ఛండీగఢ్‌లో మరో శీష్ మహల్