కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల ముందు విడుదల చేసిన 60 పేజీల మేనిఫెస్టోలో 420 హామీలు, 13 ముఖ్య వాగ్దానాలు, అలాగే 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పింది. కానీ ఈ రోజు 100 రోజులు కాదు, దాదాపు 1000 రోజులు గడుస్తున్నా, ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిందని బీజేపీ విమర్శించింది. తెలంగాణ పేదల మీద కాంగ్రెస్ పెట్టిన ఈ హస్తం నిజానికి అభయ హస్తం కాదు – భస్మాసుర హస్తం అంటూ మండిపడింది.
23 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణ ప్రజలకు ఒక భస్మాసుర హస్తంగా మారిందని రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారు? ఏ మొహంతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? అని ప్రశ్నించారు. మోసపూరితమైన మాటలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 23 నెలలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటికీ ఏ వర్గానికీ మీరు న్యాయం చేయలేదని ఆయన ధ్వజమెత్తారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొంటూ మోసపూరిత వాగ్దానాలు, ఎన్నికల ముందు ఇచ్చిన ఆకర్షణీయ హామీలు — ఇవన్నీ ప్రజలను మోసం చేసే రాజకీయ నాటకం మాత్రమేనని ఈరోజు స్పష్టమవుతోందని ఆయన విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు.. కేవలం ఓట్ల కోసం వేసిన వల మాత్రమే. బీసీ వర్గాల ఆశలను కూడా మోసం చేసిన ప్రభుత్వం ఇది అంటూ ఆయన దుయ్యబట్టారు.
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల దారిలోనే నడుస్తోందని రామచందర్ రావు తెలిపారు.
ప్రజల ఆస్తులు, అభివృద్ధి, శాంతి భద్రతలకు మించి, అధికారాన్ని కాపాడుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ పనితీరు గురించి ప్రజల ఎదుట సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
23 నెలల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటీ నెరవేర్చని పూర్తిగా వైఫల్యం చెందిన ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజల వద్ద ఓటు అడిగే హక్కు లేదని బిజెఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ ప్రచారానికి దిగజారారని ఆయన మండిపడ్డారు.
“కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుంటే రూ.2000 పెన్షన్ కట్ అవుతుంది, 25వేల రేషన్ కార్డులు రద్దవుతాయి, ఉచిత బియ్యం రావు” అని ప్రజలను భయపెట్టే విధంగా మాట్లాడారని పేర్కొంటూ ఇది పూర్తిగా బ్లాక్మెయిల్ రాజకీయమే అంటూ ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం, ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం అని స్పష్టం చేశారు. ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నందుకు తాము ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లబోతున్నామని వెల్లడించారు.
ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు లక్ష్మీ బసవ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

More Stories
రిజర్వేషన్ జీవోకు మళ్లీ న్యాయ చిక్కులు తప్పవా?
తెలంగాణలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు
రాష్ట్రపతి నిలయంలో ‘పశ్చిమ్ కి పరంపర’