 
                బైబిల్ వల్ల జీవితాలు మారలేదు.. భగవద్గీత వల్ల ప్రజల బతుకులు బాగుపడలేదు.. కేవలం అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ప్రజల తలరాతలు మారాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడు, మడకశిర టిడిపి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి.  ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, కొన్ని హిందూ సంస్థలు, రాజకీయ వర్గాలు ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి.
 రాజ్యాంగం ప్రాముఖ్యతను వివరించే క్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు కొందరికి అభ్యంతరకరంగా అనిపించాయి. ఆయన ఉద్దేశం మత గ్రంథాలను అవమానించడం కాదని, రాజ్యాంగం సమానత్వాన్ని ఎలా తీసుకువచ్చిందో గుర్తు చేయడమేనని చెప్పారు.  టీటీడీ బోర్డు సభ్యుడు, బిజెపి నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ  “టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న వ్యక్తి భగవద్గీతను తక్కువ చేసి మాట్లాడడం సరికాదు. వెంటనే క్షమాపణలు చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు. 
ఎంఎస్ రాజు వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్ మండిపడ్డారు. రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని.. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు పదవులకు ఎంఎస్ రాజు రాజీనామా చేయాలని.. లేకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పలు హిందూ సంస్థలు ఈ వ్యాఖ్యలను ‘సనాతన ధర్మానికి అవమానం’గా అభివర్ణించాయి. కొందరు రాజును టిడిపి నుండి బహిష్కరించాలని, టీటీడీ బోర్డు నుండి తొలగించాలని కోరారు. సోషల్ మీడియాలో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
వివాదం చెలరేగిన తర్వాత ఎంఎస్ రాజు తన వైఖరిని స్పష్టంచేస్తూ  “నేను దళిత హిందువును, నా కుటుంబం మొత్తం హిందూ మతాన్నే అనుసరిస్తుంది. నేను భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ మత గ్రంథాన్నీ అవమానించలేదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సమాజంలో మార్పు తీసుకువచ్చిందని మాత్రమే చెప్పాను” అని వివరణ ఇచ్చారు. 
మొంథా తుఫాను సమయంలో ప్రజలకు ప్రభుత్వం అందజేస్తోన్న సేవలను పక్కదారి పట్టించేందుకు ఇదంతా ప్రతిపక్ష వైఎస్‌ఆర్సీపీ చేస్తోన్న కుట్ర అని ఆరోపించారు. తాను దళిత హిందువునని, భూమన కరుణాకర్ రెడ్డిలా ఇంట్లో ఒక మతం, బయట పదవుల కోసం ఇంకో మతం ఆనుసరించే వ్యక్తిని కాదని అంటూ ఎద్దేవా చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉంటే ఓ హిందూ సోదరుడిగా అందరికీ క్షమాపణలు చెబుతున్నానని చెబుతూ వీడియా విడుదల చేశారు.  అంతేకాకుండా “రాష్ట్రంలో 5,000 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాను, మడకశిరలో పలు ఆలయ కార్యక్రమాలను నిర్వహించాను” అని గుర్తుచేశారు. 
 ‘‘గత రెండు రోజులుగా వైసీపీ, వారి అనుకూల సోషల్ మీడియా, కొన్ని యూటూబ్ ఛానెళ్లలో నేను భగవద్గీతని అవమానించినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను ఎక్కడా భగవద్గీత, ఇతర మత గ్రంథాలను కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం మాత్రమే చేశాను. భగవద్గీత, ఖురాన్ వంటి మహా గ్రంథాల వల్ల దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. కానీ రాజ్యాంగం వల్ల వారు జీవితాలు మెరుగుపడ్డాయని మాత్రమే అన్నాను తప్ప ఎక్కడా భగవద్గీతను అవమానించేలా, హిందూ సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదు” అంటూ వివరణ ఇచ్చుకున్నారు. 
                            
                        
	                    




More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
యమునా నదిని పరిశుభ్రం చేయడం అసాధ్యం కాదు!
బీహార్ లో 129 మంది పాతవారినే తిరిగి నిలబెడుతున్న ఎన్డీయే