మొంథా తుపాను ప్రాథమిక నష్టం రూ.5265 కోట్లు

మొంథా తుపాను ప్రాథమిక నష్టం రూ.5265 కోట్లు
మొంథా తుపాను ప్రాథమిక నష్టం అంచనా దాదాపు రూ.5265 కోట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పూర్తి స్థాయి నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు. పటిష్ఠమైన సమాచార సాంకేతిక వ్యవస్థను 16 నెలల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. నీళ్లు ఎక్కడా నిల్వ లేకుండా డ్రైన్స్లోకి పంపగలిగామని తెలిపారు. ఎక్కడ నీరు నిలిచినా డ్రోన్లు, సీసీటీవీల ద్వారా గుర్తించి తొలగించగలిగామని పేర్కొన్నారు.
 
ఒకప్పుడు చెట్టు కూలితే తొలగించేందుకు రోజుల తరబడి సమయం పట్టేదని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు.  రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టం (ఆర్టిజిఎస్) ద్వారా కాటమనేని భాస్కర్ బృందం కనబర్చిన పనితీరు అభినందనీయమని కొనియాడారు. మొత్తం సిబ్బంది అద్భుత పనితీరు కనబరిచారని ప్రశంసించారు.
 
ఇప్పటికీ 35 మండలాల్లో వర్షం పడలేదని 37 కరవు మండలాలు నమోదయ్యాయని సీఎం వెల్లడించారు. నదుల అనుసంధానం జరిగితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ తుపాను వల్ల ఎక్కువ నష్టం బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఉందని చెప్పారు.  వచ్చే విపత్తును ఆపలేం కానీ ప్రాణ నష్టం జరగకుండా ఎన్ని చర్యలు చేపట్టాలో అన్ని చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు.
 
తుపాను వల్ల ఎవరూ చనిపోలేదని కానీ 120 పశువులు మృతి చెందాయని వెల్లడించారు. ఈ తుపాను వల్ల ఆర్‌అండ్‌బీకి ఎక్కువ నష్టం వాటిల్లిందని కానీ నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువేనని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో డ్యామ్‌లు కొట్టుకుపోయాయని సీఎం విమర్శించారు. ప్రస్తుతం ప్రాజెక్టు గేట్లు పని చేయలేదని ఎక్కడా ఫిర్యాదు లేదని, మా అప్రమత్తత వల్ల నీటిపారుదల శాఖకు నష్టం తక్కువ వాటిల్లిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది అందరూ నిబద్ధతతో పని చేశారని ఇది చాలా సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వర్షాలు పడుతున్నా కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించి ఇబ్బందులు లేకుండా చేశారని కొనియాడారు. మెుంథా తుపాను బీభత్సాన్ని ముందుగానే అంచనా వేయడం వల్లే నష్టనివారణ తగ్గిందని, ఓ పద్ధతి ప్రకారం సాంకేతికతను సక్రమంగా వినియోగించామని తెలిపారు. 

గతంలో విద్యుత్‌ సరఫరా ఆగితే 10 గంటల వరకు వచ్చేది కాదు కానీ ప్రస్తుతం విద్యుత్‌ సరఫరా ఆగిన 3 గంటల్లోనే పునరుద్ధరణ జరిగిందని సీఎం చంద్రబాబు చెప్పారు. కాగా, ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూస్తుంటే కొందరు ఫేక్ పోస్టులు పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం కూడా వారికి ఇష్టం లేనట్టు ఉందని విమర్శించారు. శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా పరిస్థితిని అంచనా వేశామని,  గతంలో గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని మండిపడ్డారు. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారని ప్రశంసించారు. వారందరికీ అభినందనలు తెలిపారు.