ఎన్నికల్లో పోటీచేస్తా.. లేకపోతే లక్షలాదిమంది బహిష్కరిస్తారు!

ఎన్నికల్లో పోటీచేస్తా.. లేకపోతే లక్షలాదిమంది బహిష్కరిస్తారు!
వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. ఒకవేళ తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే.. తమకు ఉన్న లక్షలాది మంది మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్‌లో మళ్లీ అధికారం చేపట్టడానికైనా, ప్రతిపక్ష పాత్ర పోషించడానికైనా తమ పార్టీ సిద్ధంగా ఉందని షేక్ హసీనా స్పష్టం చేశారు.
బంగ్లాలో రాజ్యాంగ పాలన, రాజకీయ స్థిరత్వం తీసుకురావాలంటే తిరిగి తమ పార్టీ అధికారం చేపట్టాలని ఆమె హెచ్చరించారు. అయితే, దేశ భవిష్యత్తును ఏ ఒక్క వ్యక్తిగానీ, కుటుంబం కానీ నిర్వహించాలని తాను అనుకోవట్లేదని ఆమె తేల్చి చెప్పారు.  అయితే తాను దేశం విడిచి వెళ్లాక అవామీ లీగ్ నేతలపై దాడులు చేయడంతో తాత్కాలిక ప్రభుత్వం తమ ఓటమిని ఒప్పుకుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
 “ఇది నిజంగా నా గురించి లేదా నా కుటుంబం గురించి కాదు. బంగ్లాదేశ్ మనమందరం కోరుకునే భవిష్యత్తును సాధించాలంటే, రాజ్యాంగ పాలన,  రాజకీయ స్థిరత్వానికి తిరిగి రావాలి. ఏ ఒక్క వ్యక్తి లేదా కుటుంబం మన దేశ భవిష్యత్తును నిర్వచించదు” అని హసీనా పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో నివసిస్తున్న ఆమె కుమారుడు, సలహాదారు సజీబ్ వాజెద్ గత సంవత్సరం రాయిటర్స్‌తో మాట్లాడుతూ, అడిగితే అవామీ లీగ్‌కు నాయకత్వం వహించడాన్ని తాను పరిగణించవచ్చని అన్నారు.
పార్టీపై నిషేధం విధించడంతో భయపడిందని ఆమె స్పష్టం చేశారు. తదుపరి బంగ్లాదేశ్‌లో అధికారం చేపట్టబోయే పార్టీ రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడాలని ఆమె చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మహమ్మద్ యూనస్‌ ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను హసీనా ఈ సందర్భంగా కొట్టిపారేశారు. “ప్రభుత్వం చట్టబద్ధంగా ఉండి, రాజ్యాంగాన్ని సమర్థిస్తూ, శాంతిభద్రతలు నిజంగానే ఉన్నంత వరకు నేను ఇంటికి వెళ్లడానికి ఇష్టపడతాను” అని హసీనా చెప్పారు.
“అవామీ లీగ్ పై నిషేధం అన్యాయం మాత్రమే కాదు, అది స్వీయ ఓటమి” అని హసీనా పేర్కొంటూ ఢాకా తదుపరి ప్రభుత్వానికి ఎన్నికల చట్టబద్ధత ఉండాలని ఆమె స్పష్టం చేశారు. “లక్షలాది మంది ప్రజలు అవామీ లీగ్‌కు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా, వారు ఓటు వేయరు. పనిచేసే రాజకీయ వ్యవస్థ కావాలంటే లక్షలాది మంది ప్రజల ఓటు హక్కును మీరు తొలగించలేరు” అని ఆమె హెచ్చరించారు. 
 
కాగా, మొదటిసారి మీడియా ముందుకు రావడంతో హసీనా మళ్లీ బంగ్లాలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. . గతేడాది జరిగిన విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిలో ప్రధాని పీఠం నుంచి ఆమె దిగిపోయారు. అనంతరం బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చి తలదాచుకుంటున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన హసీనా తొలిసారి మీడియాతో మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా ఢిల్లీలో తాను స్వేచ్ఛగా నివసిస్తున్నానని ఆమె చెప్పారు. తన కుటుంబంపై జరిగిన హింసాత్మక దాడుల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈమెయిల్‌లో తన అభిప్రాయాలు వెల్లడించిన హసీనా ఆవామీ లీగ్‌ పార్టీ నేతలపై ఆరోపణలు, స్వదేశానికి తిరిగి వెళ్లాలనే ఆలోచనలు మొదలైన విషయాలపై మాట్లాడారు. 
 
మరోవైపు, బంగ్లాదేశ్ పరిస్థితిపై గతంలో అమెరికా అవామీ లీగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రబ్బీ ఆలం ఆందోళనం వ్యక్తం చేశారు. దేశం దాడికి గురవుతుందని పేర్కొంటూ అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని ఆయన చెప్పారు. ఈ క్రమంలో షేక్ హసీనాకు ఆశ్రయం కల్పిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన రబ్బీ ఆలం అలాగే షేక్ హసీనా త్వరలోనే తిరిగి ప్రధానిగా బంగ్లాకు వస్తారని ప్రకటించారు. 
షేక్ హసీనా భారత్‌కు వచ్చాక. మహమ్మద్ యూనస్ ఆపద్ధర్మ నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే త్వరలోనే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించినా ఇప్పటివరకు యూనస్ ఆ పని చేయలేదు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరిపించనున్నట్లు చెప్పారు.